వైభవంగా శోభనగిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శోభనగిరి ప్రదక్షిణ

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

వైభవంగా శోభనగిరి ప్రదక్షిణ బంగారు తులసీదళాల సమర్పణ ఫుట్‌బాల్‌ విజేత ‘సీఆర్‌ఆర్‌’

ఆగిరిపల్లి: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శోభనగిరి ప్రదక్షిణ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు భూనీళా సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుచ్చి పల్లకిపై అధిష్ఠించి శోభనగిరి చుట్టూ వేలాది మంది భక్తుల సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, స్తోత్ర పఠనం, గోవింద నామస్మరణల మధ్య గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదల శివరామ్‌ ప్రసాద్‌ (బుజ్జి), గుండుబోగుల రామకృష్ణ ప్రసాద్‌, గుండుబోగుల వెంకట రమేష్‌ (చిన్నారి), రాణి మేకల సత్యనారాయణ దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి సాయి పర్యవేక్షించగా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై సురేష్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం) : గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శనివారం స్థానిక భక్తులు పొదిలి దుర్గాప్రసాద్‌, శివఈశ్వరి దంపతులు రూ.6 లక్షల విలువైన బంగారు తులసీదళాలను సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణ, అర్చకులు నల్లూరి రవికుమార్‌ ఆచార్యులకు వీటిని అందజేశారు. పారిజాతగిరిలో కార్తీక మాసం రెండో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్‌ కళాశాలల పురుషుల ఫుట్‌బాల్‌ పోటీల్లో ఏలూరు సర్‌ సీఆర్‌ రెడ్డి కళాశాల జట్టు విజేతగా నిలిచింది. స్థానిక సీఆర్‌ రెడ్డి కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో కాకినాడ ఐడియల్‌ కళాశాల ద్వితీయ, గోపన్నపాలెం ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ కళాశాల తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు కళాశాల కరస్పాండెంట్‌ కేఎస్‌ విష్ణుమోహన్‌, ప్రిన్సిపాల్‌ ఎం. రత్నాకర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కే. విశ్వేశ్వరరావు, ఆఫీసు సూపరింటెండెంట్‌ వీ. వేణుగోపాలకృష్ణ ట్రోఫీ అందజేశారు. విశ్వవిద్యాలయం తరఫున సెలక్షన్‌ కమిటీ సభ్యునిగా చంద్రశేఖర్‌, పరిశీలకునిగా ఫణీంద్ర వ్యవహరించారు. ప్రథమ స్థానం సాధించిన జట్టును, ఫిజికల్‌ డైరెక్టర్లు ఎస్‌డీ నాగిని, ఎండీ కరీముల్లాలను యాజమాన్యం, ప్రిన్సిపాల్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement