పట్టించుకోకుంటే ఎలాగండి? | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోకుంటే ఎలాగండి?

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

రైతులకు కడగండ్లు

● కొవ్వాడ కాలువకు భారీ గండ్లు

● గట్ల కోతలతో పొలాల్లో ఇసుక మేటలు

● వరుస తుపాన్లతో అపార నష్టం

పోలవరం రూరల్‌: పోలవరం మండలంలో కనీవినీ ఎరుగని రీతిలో కొవ్వాడ కాలువ పొంగి ప్రవహించడంతో అపార నష్టం వాటిల్లింది. ఇటీవల ఆర్నాబ్‌, మురుసు తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొండవాగులు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాయి. ప్రగఢపల్లి నుంచి పట్టిసం ఔట్‌ఫాల్‌ స్లూయిజ్‌ వరకు కొవ్వాడ కాలువ కుడి, ఎడమ గట్లకు రెండు చోట్ల భారీ గండ్లు పడ్డాయి. గట్లు సైతం కోతకు గురయ్యాయి. కొన్నిచోట్ల గట్టుపై నడిచి వెళ్లలేని పరిస్థితి.

పొలాల్లో ఇసుక మేటలు.. కూలిన గృహాలు

గండ్లు పడటంతో వరద నీరు పొలాలను ముంచెత్తింది. ఫలితంగా పంట నష్టంతో పాటు సాగు భూములన్నీ ఇసుక మేటలుగా మారాయి. మరోవైపు గండి పడిన ప్రాంతం నుంచి నీరు జాతీయ రహదారిని దాటి పోలవరం వైపు దూసుకురావడంతో ముంపు మరింత తీవ్రమైంది. పలు ప్రాంతాలు వరద బారిన పడ్డాయి. గట్లకు ఆనుకుని ఉన్న అనేక ఇళ్లు కూలి కాలువలో కలిసిపోయాయి. కాలువ ప్రవాహ దిశ సైతం మారింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కొవ్వాడ గట్టుకు అతి సమీపంలో భారీగా గట్టు జారి కాలువలో కలిసిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏ మాత్రం వర్షం కురిసినా మళ్లీ ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది.

అన్నదాత.. గుండెకోత

ఈ విపత్తుతో మండలంలోని రైతులు కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. కొన్నేళ్లుగా ఇటువంటి భీకర పరిస్థితులు చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత నష్టపరిహారం అందించినా ఈ నష్టానికి సరిపోదని వాపోతున్నారు. తాత్కాలికంగా గండ్లు పూడ్చి కాలువలోని నీరంతా గోదావరి నదిలోకి చేరేలా చర్యలు తీసుకున్నా ఇది శాశ్వత పరిష్కారం కాదని అంటున్నారు. యుద్ధప్రాతిపదికన శాశ్వత పనులు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

పటిష్ట పనులకు ప్రతిపాదనలు

కొవ్వాడ కాలువ నష్టాన్ని అధిగమించి పటిష్ట పనులు చేపట్టేందుకు రూ.28 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు కొవ్వాడ ఉప కార్యనిర్వహక ఇంజినీర్‌ ఎన్‌.సుజాత తెలిపారు. గండ్లు పూడ్చటంతో పాటు కోతకు గురైన ప్రాంతాల్లో సుమారు 7 కిలోమీటర్ల మేర పటిష్ట పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు అందజేశామన్నారు. తాత్కాలికంగా కొవ్వాడ నీరు ఇరువైపులా ప్రవహించకుండా నేరుగా గోదావరి నదిలోకి వెళ్లేలా ఇసుక మేటలు తొలగించి మార్గం సుగమం చేశామని తెలిపారు. అలాగే రెండు చోట్ల పడిన గట్లను మట్టితో తాత్కాలికంగా పూడ్చే పనులు కొనసాగుతున్నాయని, ఈ పనులకు కలెక్టర్‌ రూ.30 లక్షలు మంజూరు చేశారని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని డీఈ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement