మన్యంలో చలి పంజా | - | Sakshi
Sakshi News home page

మన్యంలో చలి పంజా

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

మన్యంలో చలి పంజా

శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలి

వెచ్చని దుస్తులే రక్షణ.. జాగ్రత్తలు తప్పనిసరి

బుట్టాయగూడెం : మన్యంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శీతల గాలుల వీచడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోయి చలిపులి పంజా విసురుతోంది. సాయంత్రం వేళల నుంచే మంచు తెరలు కమ్ముకుని, అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు దట్టమైన మంచు కురుస్తోంది. ఉదయం సూర్యోదయం తర్వాతే మంచు తెరలు వీడుతుండడంతో మన్యంలోని గ్రామాలు చలితో గజగజ వణికిపోతున్నాయి.

జనజీవనం ఇబ్బందులు

మన్యంలోని కొండలు, అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో జనజీవనంపై ప్రభావం పడుతోంది. ఉదయం వేళల్లో పొలం పనులకు వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు చలిగాలుల ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు మంచు, చలిగాలుల వల్ల మరింత జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

చిన్నారులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం

మారుతున్న వాతావరణం, పెరుగుతున్న చలి ప్రభావం చిన్నారులు, వృద్ధులపై ఎక్కువగా కనిపిస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు చలిగాలులకు త్వరగా ప్రభావితమవుతున్నారు. అలాగే వృద్ధులు ఉదయం, సాయంత్రం వేళల్లో చలికి తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు చలి కాచుకునేందుకు సాయంత్రం నుంచే రచ్చబండలు, కూడళ్ల వద్ద మంటలు వేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

సీజనల్‌ వ్యాధులపై వైద్యుల హెచ్చరికలు

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చలిగాలుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్లవారుజాము, రాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగడం తగ్గించాలని, లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని హితవు పలుకుతున్నారు.

శీతాకాలంలో ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వాతావరణమార్పులు కారణంగా వైరల్‌ జ్వరాలు, గొంతు ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది. ఆస్తమా, శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు నిద్రించే సమయంలో గదిలో తగినంత వెచ్చదనం ఉండేలా చూడాలి. ఐదేళ్లలోపు పిల్లలకు స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు వేయాలి. ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి

– డాక్టర్‌ జె.సురేష్‌, అంతర్వేదిగూడెం పీహెచ్‌సీ, బుట్టాయగూడెం మండలం

చలి బారి నుంచి రక్షణ పొందేందుకు వెచ్చని ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, మఫ్లర్లు, దుప్పట్లు తప్పనిసరిగా వినియోగించాలని ప్రజలకు సూచిస్తున్నారు. కాచి వడబోసిన గోరువెచ్చని నీటిని తాగడం, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుందని చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులను వెచ్చగా ఉంచడంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏజెన్సీలో చలిపులి ఉధృతి కొనసాగుతున్న దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని స్థానికులు, వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

శీతల గాలులతో క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

చిన్నారులు, వృద్ధులపై మంచు ప్రభావం, పెరుగుతున్న వణుకు

సీజనల్‌ వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలపై వైద్యుల హెచ్చరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement