ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనానికి కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కె.గోపాలపురానికి చెందిన జానపరెడ్డి శ్రీనివాస్ ఈనెల 16న ద్వారకాతిరుమల వచ్చారు. 17న ఉదయం కుటుంబ సభ్యులంతా ఆలయానికి వెళ్లగా.. శ్రీనివాస్ ఒత్తులు వెలిగించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఇప్పటివరకూ అతడి ఆచూకీ తెలియకపోవడంతో సోదరి జానపరెడ్డి మహాలక్ష్మి శుక్రవారం ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, శ్రీనివాస్ ఆచూకీ తెలిసిన వారు సెల్ 9440796653కు సమాచారం అందించాలని ఎస్సై టి.సుధీర్ కోరారు.
ఉంగుటూరు: గ్రామంలోని దళితపేటకు చెందిన మంద సుభద్ర (39) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చిన ఆమెకు భర్త నాగయ్యతో చిన్నపాటి విషయాలపై తరచూ గొడవలు జరిగేవి. ఈ నెల 16న ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భర్త కోపంతో బయటకు వెళ్లాడు. అనంతరం సుభద్ర ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపు తీసి చూడగా ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్సనందించి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


