కూటమి తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం | - | Sakshi
Sakshi News home page

కూటమి తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

కూటమి తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం

చింతలపూడి: బెదిరింపులు, ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు నివాసం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 19వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని బెదిరించి, ప్రలోభాలకు గురిచేయడంతో పాటు కుల పెద్దలు, మత పెద్దలతో ఒత్తిడి తెచ్చి చివరి నిమిషంలో నామినేషన్‌ ఉపసంహరించుకునేలా చేశారని ఆయన విమర్శించారు. ఇలా బలవంతంగా ఉపసంహరింపజేసి కూటమి అభ్యర్థి ఏకగ్రీవమైనట్లు ప్రకటించుకోవడం అప్రజాస్వామికమని, ఇది అసలైన గెలుపు కాదని ఆయన పేర్కొన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి ప్రజల ఆశీస్సులతో గెలవాలని, అధికారం, డబ్బు బలంతో అభ్యర్థులను ప్రలోభపెట్టడం సరికాదని అన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ జరగలేదని, అందుకే ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడగడానికి కూటమి నేతలు భయపడుతున్నారని విజయరాజు విమర్శించారు. కూటమి అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనించి, ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, జిల్లా మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శి చిలుకూరి జ్ఞానారెడ్డి, రాష్ట్ర మేధావుల విభాగం కార్యదర్శి గోలి చంద్రశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ విభాగం కార్యదర్శి ఆతుకూరి సుబ్బారావు, రాష్ట్ర మేధావి విభాగం సహాయ కార్యదర్శి గడ్డ బడుగుల రాజేష్‌ నాయుడు, జిల్లా క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి కె. ఎలియా, మైనార్టీ విభాగం నాయకుడు ఎండి జిలాని, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్‌. కాంతారావు, నియోజకవర్గ యూత్‌ విభాగం అధ్యక్షుడు ఎం. దిలీప్‌ కుమార్‌, నాయకులు గొట్టాపు బాబు, నిమ్మగడ్డ దుర్గారావు, విజయ్‌ కుమార్‌, అజయ్‌ రెడ్డి, మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ చింతలపూడి కన్వీనర్‌ విజయరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement