ఏలూరు (ఆర్ఆర్పేట): రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు వారి సొంత లేదా సమీప మండలాల్లోనే విధులు కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారి శాంతికి వినతిపత్రం అందజేశారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో దూరప్రాంతాల్లో విధులు వేయడం వల్ల ప్రయాణ సమయం, రవాణా సౌకర్యాల కొరత, భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తుచేశారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులకు ప్రాధాన్యమిస్తూ సొంత మండలాల్లోనే విధులు కేటాయించేలా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ జి. మోహన్, సెక్రటరీ జనరల్ ఎం. ఆదినారాయణ, కో–ఛైర్మన్ బి. వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు టి. రామారావు, జి. రమణ ఉన్నారు.


