ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): లైంగిక దాడుల నుంచి బాలలను రక్షించేందుకే పోక్సో చట్టాన్ని రూపొందించారని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి తెలిపారు. స్థానిక హనుమాన్‌నగర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం బాలల హక్కులు, పోక్సో చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ చట్టం కింద నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవని, సన్నిహితులే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌లను అవసరాలకు మాత్రమే వాడుతూ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని లేదా టోల్‌ఫ్రీ నంబరు 15100 ద్వారా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వి. హరిబాబు తదితరులు పాల్గొన్నారు.


