నేడు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నేడు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక శుక్రవారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏలూరు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరోక్ష విధానం ద్వారా జెడ్పీటీసీ సభ్యులు చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉంటుంది. పరోక్ష విధానంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను చేతులు పైకెత్తి ఓటు వేసే ప్రక్రియ ద్వారా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్నుకోనున్నారు. 27 జెడ్పీటీసీ స్థానాలకుగాను 18 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 3 స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, 5 స్థానాల్లో జనసేన, ఒక స్థానంలో బీజేపీ గెలుపొందారు. పెదవేగి మండల జెడ్పీటీసీ సభ్యురాలిగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుమార్తె చింతమనేని నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమె చైర్మన్‌ రేసులో ఉన్నారు.

రెండో విడతలో 383 నామినేషన్లు

ఎనిమిది మండలాల్లో జరిగే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మొత్తం 194 పంచాయతీలకుగాను, 383 సర్పంచ్‌నామినేషన్లు, 1972 వార్డులకుగాను 1772 నామినేషన్లు దాఖలయ్యాయి. 18న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. మొత్తం ఇప్పటి వరకు 521 సర్పంచ్‌ నామినేషన్లు, 2150 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలయ్యాయి.

మూడో విడత షెడ్యూల్‌ఇలా:

జిల్లాలో మూడో విడత నామినేషన్‌ షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న తుది జాబితా విడుదల, డిసెంబర్‌ 2న పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. మూడో విడతలో ఏలూరు, నూజివీడు డివిజన్‌లోని 8 మండలాల్లో 173 గ్రామ పంచాయతీలు, 1828 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 4.19 లక్షల మంది పల్లె ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా 1844 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. దెందులూరు, ఏలూరు, పెదపాడు, పెదవేగి, ఆగిరిపల్లి, ఛాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాల్లో పంచాయతీలకు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

పరోక్ష విధానంలో ఎన్నిక నిర్వహణ

ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం

కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ

మూడవ విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement