భీమవరం: జేఎన్‌టీయూకే ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్ మీట్‌లోని వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని వి.కల్యాణిబాయి బంగారు పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ కేవీ మురళీకృష్ణంరాజు తెలిపారు. గురువారం పతకం సాధించిన కల్యాణిబాయిని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత వర్మ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఈ నెల 14, 15 తేదీలలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సెంట్రల్ జోన్ పోటీల 49 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్.హరిమోహన్, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ జి.సారిక, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్.దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


