వణికిస్తున్న విషజ్వరాలు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న విషజ్వరాలు

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

వణికిస్తున్న విషజ్వరాలు

ప్రతి ఇంట్లో జ్వర పీడితులు

బయట ల్యాబ్‌లకు పంపుతున్నారు

కుక్కునూరు : మండలంలోని ఎర్రపాడు, రెడ్డిగూడెం, తోగూడెం గిరిజన గ్రామాలను విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని దాదాపు ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు జ్వరాల బారిన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగినంతగా స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జ్వరాలతో పనులకు వెళ్లలేక ఇళ్లకే పరిమితమవుతున్నామని, ఒకరికి వస్తే మిగిలిన వారికీ సోకుతుందేమోనన్న భయం నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. నిరుపేద కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేక ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నాయి.

ప్రభుత్వ వైద్యశాలల్లో కరువైన సేవలు

విషజ్వరాలు, మలేరియా లక్షణాలతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నా ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన పరీక్షలు, సమగ్ర చికిత్స అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో అప్పులు పాలవుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన వేళ ఇలాంటి దుస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలి

మూడు గ్రామాల్లోని పరిస్థితిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని, బాధితులకు రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అవసరమైన వారిని ఉన్నత ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మూడు గిరిజన గ్రామాల్లో జ్వరాల విజృంభణ

ఇంటికో ఇద్దరు చొప్పున జ్వర బాధితులు

ప్రభుత్వ వైద్యశాలల్లో సరైన వైద్యం కరువు

తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తుల డిమాండ్‌

మా గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న వారు ఉన్నారు. అమరవరం పీహెచ్‌సీకి వెళ్లినా సరైన వైద్యం అందడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నాం. అధికారులు స్పందించి తక్షణమే వైద్య సేవలు అందించాలి.

– సరియం ప్రసాద్‌, రెడ్డిగూడెం గ్రామం

అమరవరం పీహెచ్‌సీకి వెళ్తే పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు పంపుతున్నారు. నిరుపేద గిరిజనులకు ఇది భారంగా మారింది. ల్యాబ్‌ల్లో పరీక్షించి మలేరియా పాజిటివ్‌ ఉందని చెబుతున్నారు. గ్రామాల్లోనే పరీక్షలు, మెరుగైన వైద్యం అందించాలి.

– కూరం సంజీవరావు, ఎర్రపాడు గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement