రమణక్కపేట అడవిలో పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

రమణక్కపేట అడవిలో పెద్దపులి

Nov 19 2026 2:55 AM | Updated on Nov 19 2026 2:55 AM

నూజివీడు/చాట్రాయి/ముసునూరు: జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో కలకలం రేపుతోంది. గత కొన్ని నెలలుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి తాజాగా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం రమణక్కపేట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి చేరుకుంది. లింగపాలెం, ధర్మాజీగూడెం, చింతలపూడి, చిత్తపూరు మీదుగా రమణక్కపేట ప్రాంతంలోకి బుధవారం వేకువజామున పులి చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పెద్దపులి రమణక్కపేట నుంచి చాట్రాయి మండలం చిత్తపూరు వెళ్లే మట్టిరోడ్డు మార్గంలో ఉన్న తెలకలమ్మ గట్టుపై పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి జాడను గుర్తించేందుకు ఫారెస్ట్‌ అధికారులు, రెస్క్యూ టీం బుధవారం పగలు డ్రోన్‌ కెమెరాలతో అడవిలో గాలించారు. పెద్దపులి గుట్టపై ఉందని, దానిని పట్టుకోవడానికి ఆవును ఎరవేశారు. దీనిలో భాగంగా ఆవును గుట్టపైకి పంపారు. రమణక్కపేట, చాట్రాయి మండలం చిత్తపూరు, ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామాలకు సమీపంలో పులి సంచరిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు పులి కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు ఫారెస్ట్‌ అధికారులు,స్పెషల్‌ రెస్క్యూ టీమ్‌ చర్యలు చేపట్టారు. అటవీ, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. పులి సంచార ప్రాంతాలకు సమీపంలోని రైతులు,వ్యవసాయ కూలీలు,పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పశువులను అడవుల సమీపంలో మేతకు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. జిల్లా అటవీ శాఖ అధి కారి సందీప్‌ రెడ్డి ఆధ్వర్యంలో నూజివీడు ఫారెస్ట్‌ రేంజర్‌ సత్యనారాయణ, రెస్క్యూ టీమ్‌తో కలిసి అనుమానిత అటవీ ప్రాంతంలో క్షేత్ర పరిశీలన చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement