గణపవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో దశలో 121 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో జి.వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆయన గణపవరం సచివాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో ఒకటికి రెండుసార్లు పరిశీలించి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రంలో ఏర్పాట్లు, హెల్ప్‌లైన్, ప్రథమ చికిత్సా కేంద్రం, ఇతర వసతులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నూకల రంగలక్ష్మి, ఎంపీడీవో రంగనాయకులు, పంచాయతీ కార్యదర్శి డి. శివరామప్రసాద్ పాల్గొన్నారు.
కై కలూరు : దొడ్డిపట్ల పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న నర్సుపై మంగళవారం అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు ఆత్మకూరి నరసింహారావు (27)ను బుధవారం అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై వి. రాంబాబు తెలిపారు. గతంలో ఇతనిపై నందివాడ, కై కలూరు రూరల్ పోలీస్ స్టేషన్లలో పేకాట, ఆత్మహత్యాయత్నం కేసులు ఉన్నాయన్నారు. మద్యానికి బానిసైన ఇతను, మద్యం మత్తులో నర్సుపై అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం తేనెటీగల పెంపకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వెంకట్రామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానానికి చెందిన ఎస్.ఆదర్శ తెలిపారు. వెంకట్రామన్నగూడెంలో జరుగుతున్న శిక్షణలో భాగంగా బుధవారం పలు అంశాలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించారు. తేనెటీగల్లో వచ్చే పురుగులు, వ్యాధులు, వాటి నివారణ చర్యలు, తేనెటీగల కాలనీల సమర్థవంతమైన నిర్వహణ, రాయల్ జెల్లీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై రైతులకు ప్రయోగాత్మక విషయాల గురించి వివరించారు. కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు సీహెచ్ రూత్ మాట్లాడారు.


