ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధ సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి సమర్పించగా, నాగబంధాల వద్ద అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి మూర్తుల ప్రతిష్ఠాపన తంతు నిర్వహించారు. అనంతరం నాగబంధాలు, గోకులంలోని గోవులకు మహిళలు పసుపుకుంకుమలతో పూజలు చేశారు. స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తే మేలు జరుగుతుందనే విశ్వాసంతో భక్తులు భారీగా తరలిరావడంతో, ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి, ఛైర్మన్ బొంగు రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు
కొయ్యలగూడెం: తప్పిపోయిన ఐదేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు గంట వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆదివారం ఉదయం అంకాలగూడెం గ్రామానికి చెందిన వినోద్ తన కుమారుడు ప్రజ్విష్ (5)తో కలిసి కొయ్యలగూడెం మార్కెట్‌కు వచ్చారు. రద్దీలో బాలుడు తప్పిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై బంధువులతో కలిసి గాలించారు. సమాచారం అందుకున్న ఎస్సై వి.చంద్రశేఖర్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కన్నాపురం రోడ్డు వైపు బాలుడు వెళ్లినట్లు ఫుటేజీలో గుర్తించి, వెంటనే అక్కడికి చేరుకుని బాలుడిని సురక్షితంగా స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించడంతో, పోలీసులను స్థానికులు అభినందించారు.
పెనుగొండ: సామాజికంగా ఇబ్బందులకు గురిచేసినా, చట్టవ్యతిరేకంగా వ్యవహరించినా క్రిమినల్ కేసులు తప్పవని ఆర్డీఓ దాసి రాజు హెచ్చరించారు. ములపర్రు శివారు పితానివారిపాలెంలో 10 కుటుంబాల సామాజిక బహిష్కరణ (వెలి) ఘటనపై ఆదివారం ఆయన నరసాపురం డీఎస్పీ సుధాకరరావుతో కలిసి విచారణ చేపట్టారు. గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నాటి రాజకీయ విభేదాలే ప్రస్తుత మనస్పర్థలకు కారణమని గుర్తించారు. గ్రామంలోని ఆరు సంఘాల పెద్దలు, బాధిత కుటుంబాలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు, పాలు, తాగునీరు యథావిధిగా అందేలా చర్యలు తీసుకున్నామని, ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇ.అనిత కుమారి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
గుడ్లవల్లేరు: స్థానిక శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన జేఎన్‌టీయూకే స్థాయి అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ఆదివారం రసవత్తరంగా ముగిశాయి. ఈ టోర్నమెంట్‌లో యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 350 మంది క్రీడాకారులు, 50 మంది ఫిజికల్ డైరెక్టర్లు, సెలెక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్ విభాగంలో ద్వితీయ స్థానంలో నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాల నిలిచింది.
తాడేపల్లిగూడెం (టీఓసీ): పాతూరులోని సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. సాంకేతిక లోపమే ఇందుకు కారణమని సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న టెక్నీషియన్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మరమ్మతులకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. దీంతో ఈ సబ్‌స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు అంతరాయం కలగకుండా అధికారులు వెంటనే స్పందించి, రాత్రి 9:15 గంటల ప్రాంతంలో ప్రత్యామ్నాయ మార్గంలో మరో సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను మళ్లించి సరఫరాను పునరుద్ధరించడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.


