కొయ్యలగూడెం కేంద్రంగా రేషన్‌ మాఫియా | - | Sakshi
Sakshi News home page

కొయ్యలగూడెం కేంద్రంగా రేషన్‌ మాఫియా

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

కొయ్యలగూడెం: పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా, నామమాత్రపు ధరలకు అందిస్తున్న సబ్సిడీ బియ్యం అక్రమార్కులపరమవుతుంది. కొయ్యలగూడెం కేంద్రంగా రేషన్‌ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుని యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిస్తోంది. కొందరు అవినీతి రేషన్‌ డీలర్లు, దళారులకు తోడు రెవెన్యూ సహా ఇతర శాఖల అధికారుల సహకారం కూడా ఉండటంతో ఈ దందాకు అడ్డుకట్ట పడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిల్వ కేంద్రాలుగా రాజవరం, కన్నాపురం

మండలంలోని రాజవరం, కన్నాపురం గ్రామాలు పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు ప్రధాన నిల్వ కేంద్రాలుగా మారాయి. కొయ్యలగూడెం పరిసర పంచాయతీలతో పాటు జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల మండలాల నుంచి సేకరించిన బియ్యాన్ని రాజవరంలో నిల్వ చేస్తున్నారు. అలాగే బుట్టాయిగూడెం, పోలవరం మండలాల నుంచి తెచ్చిన సరుకును కన్నాపురంలో డంప్‌ చేస్తున్నారు. గతంలో పలుమార్లు అక్రమ రవాణా కేసులు నమోదైన ఓ వ్యక్తి, కన్నాపురంలో ఏకంగా భారీ గోడౌన్‌ ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నాడంటే మాఫియా ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

దందా సాగుతోందిలా..

డబ్బు అవసరమున్న లేదా బియ్యం వినియోగించని కార్డుదారుల నుంచి దళారులు కిలో రూ.16 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేసి, టన్నుల కొద్దీ గోడౌన్లకు తరలిస్తున్నారు. అలాగే కొందరు రేషన్‌ డీలర్లు లబ్ధిదారుల వేలిముద్రలు ముందుగానే తీసుకుని, వారి కోటా బియ్యాన్ని డ్రా చేసి నేరుగా బ్లాక్‌ మార్కెట్‌కు విక్రయిస్తున్నారు. రేషన్‌ షాపుల వద్ద కిలోల చొప్పున మొదలయ్యే ఈ సేకరణ, సిండికేట్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లి టన్నులుగా మారి సరిహద్దులు దాటుతోంది. ఇతర రాష్ట్రాలతో పాటు ఏకంగా విదేశాలకు సైతం ఎగుమతి అయ్యే స్థాయికి ఈ మాఫియా విస్తరించింది.

రాత్రి వేళల్లో రవాణా.. నిఘా కరువు

అధికారుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు అక్రమార్కులు రాత్రి వేళల్లో బొలెరో, డీసీఎం వ్యాన్లలో బియ్యాన్ని గమ్యస్థానాలకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక మీడియా ప్రతినిధుల ప్రమేయం కూడా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాపై అధికారులకు సమాచారం అందించినా చర్యలు తీసుకోవడం లేదని, పైగా తమకే వేధింపులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో వలంటీర్ల వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడం వల్ల రేషన్‌ అక్రమ రవాణాను చాలావరకు నిరోధించగలిగామని, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కొయ్యలగూడెం కేంద్రంగా సాగుతున్న రేషన్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమ రవాణాకు అడ్డాలుగా

రాజవరం, కన్నాపురం గ్రామాలు

నిత్యం బొలెరో, డీసీఎం వాహనాల్లో తరలిపోతున్న టన్నుల కొద్దీ పీడీఎస్‌ బియ్యం

అధికారులకు సమాచారమిచ్చినా ఫలితం శూన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement