స్వర్ణ తమలపాకులతో పూజ | - | Sakshi
Sakshi News home page

స్వర్ణ తమలపాకులతో పూజ

Nov 14 2026 12:47 AM | Updated on Nov 14 2026 12:47 AM

స్వర్ణ తమలపాకులతో పూజ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మొసలి ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు దివ్యాంగ క్రికెట్‌ క్రీడాకారులకు గుర్తింపు కల్పించాలి యువకుడిపై పోక్సో కేసు

జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం) : గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 108 బంగారు తమలపాకులతో అష్టోత్తర పూజను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు.

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు దిగువ కాపర్‌ డ్యామ్‌ సమీపంలో రహదారిపై మొసలి సంచరించింది. అక్కడ పని చేస్తున్న లారీ డ్రైవర్లు దీన్ని ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాపర్‌ డ్యామ్‌ దిగువన గోదావరి సహజ ప్రవాహం కొనసాగుతుండటంతో, ఎగువ ప్రాంతాల నుంచి ఇటీవల వచ్చిన వరదలకు ఈ మొసలి కొట్టుకువచ్చి మెరక ప్రాంతానికి చేరుకుని ఉంటుందని భావిస్తున్నారు. పాపికొండల అభయారణ్య ప్రాంతంలో రాళ్ల మధ్య మొసళ్ల సంతతి ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) /దెందులూరు : విధి నిర్వహణలో ఉన్న కండక్టర్లు, డ్రైవర్లు ఇతర సిబ్బందిపై దాడి చేయడం శిక్షార్హమైన నేరమని, అటువంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్‌ షబ్నం స్పష్టం చేశారు. ఏలూరు–భీమవరం సర్వీసు బస్సులో గురువారం రాత్రి ప్రయాణిస్తున్న విద్యార్థిని లగేజ్‌ క్యారియర్‌లో ఉంచిన బ్యాగ్‌ నుంచి వస్తువులు కిందపడుతుండటంతో.. బ్యాగును కింద పెట్టుకోవాలని కండక్టర్ల శ్రీలక్ష్మి సూచించారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి, సహనం కోల్పోయిన విద్యార్థిని వి.మాధవిలత కండక్టర్‌పై దాడి చేయడంతో ఆమె కన్ను కింద గాయమై కళ్లజోడు కిందపడిపోయింది. ఈ ఘటనపై వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

అత్తిలి: దివ్యాంగ క్రికెట్‌ క్రీడాకారులకు మరింత గుర్తింపు, ప్రోత్సాహం, మెరుగైన అవకాశాలు కల్పించాలని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ డిఫరెంట్లీ ఏబుల్డ్‌ క్రికెట్‌ కమిటీ సభ్యుడు యడ్లపల్లి సూర్యనారాయణ, డీసీసీఐ సౌత్‌ ఇండియా కోఆర్డినేటర్‌ మధుసూదన్‌ నాయక్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని శాప్‌ కార్యాలయంలో ఆ సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భరణిని కలిసి వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యడ్లపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం శాప్‌ పారాఒలింపిక్స్‌ స్పోర్ట్స్‌ పాలసీలో రెండో కేటగిరీలో ఉన్న దివ్యాంగ క్రికెట్‌ను మొదటి కేటగిరీలోకి మార్చాలని కోరారు. దీనిపై భరణి సానుకూలంగా స్పందిస్తూ, దివ్యాంగ క్రీడాకారులకు 3 శాతం స్పోర్ట్స్‌ కోటా ద్వారా తగిన ప్రయోజనాలు అందేలా చైర్మన్‌ రవినాయుడుతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

తణుకు అర్బన్‌: ప్రేమ పేరుతో నమ్మించి మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తణుకులో వెలుగుచూసింది. తణుకు పట్టణ ఎస్సై సీహెచ్‌వీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పైడిపర్రుకు చెందిన పంజా వెంకట దుర్గారావు గత ఏడాది జనవరిలో జరిగిన ఒక ఫేర్‌వెల్‌ పార్టీలో బాలికకు పరిచయమయ్యాడు. ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా మరింత దగ్గరై, ప్రేమిస్తున్నానని నమ్మించి హోటల్‌ రూమ్‌కు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా బాలిక వద్ద ఉన్న బంగారు వస్తువులను తీసుకుని మోసం చేశాడు. ఇంట్లో ఈ విషయం బయటపడటంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement