● వరుస తుపాన్లతో పంటలు అతలాకుతలం
● కాలువలకు భారీ గండ్లు
● గండ్లు పూడ్చాలంటూ రైతుల నిరసన
పోలవరం రూరల్: అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంతో పోలవరం మండలంలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొండ వాగులు పొంగి ప్రవహించడంతోపాటు స్థానికంగా ఉన్న కొవ్వాడ కాలువ, ఇసుక కాలువలకు భారీ గండ్లు పడ్డాయి. దీంతో వరి, మినుము చేలు పూర్తిగా నీట మునిగాయి. కష్టపడి సాగు చేసిన పొలాలన్నీ ఇసుక పొరలుగా, మేటలుగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందక దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. మరో పది రోజుల్లో చేతికి రావాల్సిన పంట కళ్ల ముందే కొట్టుకుపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. దీనికితోడు మరో తుపాను హెచ్చరికలతో భారీ వర్షాలు కురిసి కాలువలు పొంగితే, ఇప్పటికే పడిన గండ్ల ద్వారా వరద నీరు మరోసారి పొలాలను ముంచెత్తే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం నమోదు చేయాలని, తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే దెబ్బతిన్న కాలువ గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాలంటూ గురువారం మండలంలోని పట్టిసం ఔట్‌ఫాల్ స్లూయిజ్ వద్ద రైతులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అదే దారిలో వెళ్తున్న డీఎస్పీ యు.రవిచంద్ర రైతులతో మాట్లాడి సమస్యను శాంతియుతంగా చర్చించారు. రైతుల సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని లేకుంటే అన్నదాతలు తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు.


