
జనతంత్రం
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు. నిజాలపై నీళ్లు చల్లవచ్చు. అసత్యాలకు ఆజ్యం పోయవచ్చు.
మన మేధోజనిత స్క్రిప్టును చనిపోయిన వారి ఆత్మలతో చదివించవచ్చు. కొత్త పుంతలు తొక్కిన ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగు తున్నాయి. ముందు ముందు మహాత్ముడి ఆత్మను ఆవాహన చేయించి గాడ్సేకు కితాబునిప్పించే రోజులు కూడా వస్తాయేమో! గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా ఇది.
మహానాడు వేదికపై స్క్రీన్ మీద కనిపించిన ఎన్టీఆర్ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆశయాలను తన తర్వాత చంద్రబాబు గొప్పగా కొనసాగిస్తున్నారట! హైదరా బాదుకు తాను సాంస్కృతిక వారథిగా నిలబడితే, చంద్రబాబు సాంకేతిక వారథిగా నిలిచిపోయారట! రెండు రూపాయలకు కిలో బియ్యంతో తాను పేదవారి కడుపు నింపితే, ‘పి–4’ పథకం తెచ్చి పేదరికాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట! ఎన్టీఆర్ బొమ్మలోని కృత్రిమ ఆత్మ పలికిన పలుకులే ఇవి. ఎన్టీఆర్‌కు వారసుడు ఎవరో కూడా ఆత్మ తేల్చే సింది. తన వారసత్వానికి వన్నె తెస్తున్న లోకేష్‌ను ‘భళా మన వడా’ అని కూడా ఏఐ ఆత్మ ఆశీర్వదించింది.
ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో ఒకసారి తన వారసునిగా బాలకృష్ణ పేరును ఆయన ప్రకటించిన సంగతి అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారు స్తుందని బాలయ్యకు ముందే తెలుసా? అందుకే ఈ కార్య క్రమానికి డుమ్మా కొట్టారా? మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యంలో లగ్నమై ఉన్నందువల్ల కూడా రాకపోయి ఉండవచ్చు.
ఒక్క బాలయ్యే కాదు... నందమూరి వంశాంకురాలేవీ ఈ జాతరలో కనిపించలేదని మీడియా రిపోర్టులు వెల్లడి స్తున్నాయి. ఈ మహానాడులో నారా వారసుడే చక్రం తిప్పు తారని అందరూ ఊహించిందే. కాకపోతే పార్టీని శాసించే స్థాయి తనదేనని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారని ఎవరూ ఊహించలేదు.
పార్టీ కోసం లోకేష్ ఆరు శాసనాలను ప్రకటించారు. శాసనమంటే అందరూ శిరసా వహించవలసిందే కదా! ఆరు శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్కును అచ్చేయవలసిన అవసరం రావచ్చు. సరిగ్గా 30 ఏళ్ళ కింద ఎన్టీఆర్‌కు చంద్రబాబు బృందం వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జగమెరిగిన చరిత్ర.
మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకు సైతం బాబు పార్టీ వెన్నుపోటు పొడవడం విస్మయానికి గురి చేస్తు న్నది. మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్ లలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమని మాట్లాడారో తెలి యని వారెవరు?
తండ్రిని కారాగారంలో బంధించి, సోదరులను హతమార్చి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్ర బాబును ఎన్టీఆర్ పోల్చారు. తన దగ్గర వినయం నటిస్తూనే పథకం ప్రకారం గోతులు తవ్విన నమ్మకద్రోహిగా నిందించారు. చరిత్ర హీనుడు అతగాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి.
అంతలోనే ఆయన ఆత్మ (అటువంటివి ఉంటాయని నమ్మితే) యూ–టర్న్ తీసుకున్నట్టు ఎలా చిత్రించగలిగారు? జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న పార్టీ వెయ్యేళ్ల భారత చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నది. అదే స్ఫూర్తితో ఈ ముప్ఫయ్యేళ్ల ఆంధ్ర చరిత్రను బాబు కూటమి తిరగరాయాలని భావిస్తున్నదా? గూగుల్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తున్నదా?
ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని గడచిన 30 ఏళ్లుగా చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియా బాగా ఒంట పట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తే ఇంకో పదేళ్లకో, ఇరవై ఏళ్లకో వెన్నుపోటు కథను బుట్టదాఖలు చేయవచ్చనే విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నది.
అటువంటిదేమీ జరగలేదని, ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే, ఆయన ఆశీర్వాదంతోనే చంద్రబాబు ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చారని చెప్పే కొత్త పరిశోధనలు కూడా ఎల్లో మీడియా వెలువరించవచ్చు. అందుకు ఈ మహానాడులో నాంది పలికారనుకోవాలి.
ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరుగుతున్న పార్టీ మహాసభల మీద ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. ఎన్నికల హామీల అమలుపై సమీక్ష ఉంటుందని, అమలు చేయలేకపోయిన అంశాలపై వివరణ ఉంటుందని, పరిపాలనా తీరుతెన్నులపై ఆడిట్ ఉంటుందని ఆశిస్తారు. విచిత్రంగా ఈ మహానాడులో ఇవేమీ జరగలేదు.

ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డిని తిట్టిపోయడమనేది ప్రతి వక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించినట్టున్నారు. అధి నేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి వక్తలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించారు.
మహానాడు తేదీలకు ముందే తెనాలిలో జరిగిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై పడుకోబెట్టి వారి కాళ్లు కదలకుండా ఒక పోలీసు తొక్కిపట్టి మరో పోలీసు అధికారి వారి అరికాళ్ళ మీద లాఠీతో బాదుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
బాధతో ఆ యువకులు చేస్తున్న ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మహానాడులో చర్చకు వచ్చి ఉండాలి. హోం మంత్రి సంజాయిషీ ఇచ్చి ఉండాలి. అటువంటి దేమీ లేకపోగా జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు.
మహానాడు సమయంలోనే టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ బాగోతం బయటపడింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జరిగి, ఆరు లక్షల కుటుంబాల్లో ఆవేదన నింపింది. ఫలితంగా ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. పదకొండు వేల పరీక్షా పత్రాల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్టు వెల్లడైంది.
ఆ పొరపాటు ఒకటి రెండు మార్కులు కాదు. కొన్ని పేపర్లలో యాభై మార్కుల వరకు తేడాలొచ్చాయి. కొన్ని సమాధానాలకు మార్కులే వేయని వైనం కూడా బయటపడింది. ఇది అసా ధారణం. రికార్డు సమయంలో ఫలితాలు వెల్లడించాలన్న దుగ్ధతో టీచర్ల మెడ మీద కత్తి పెట్టినందువల్లనే ఇలా జరిగిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి అపురూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థను ఒక్క ఏడాదిలోనే నేలకేసి కొట్టిన ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. దీనిపై మహానాడులో చర్చ జరిగి ఉండాలని జనం కోరుకుంటారు. విద్యామంత్రి వివరణ ఇస్తారని ఆశిస్తారు. కానీ ఆయన వివరణ ఇవ్వలేదు. హాజరైన ప్రతినిధులు అడిగే సాహసం చేయలేదు.
ఈ రెండు అంశాలే కాదు, పాలనాపరమైన ఏ అంశం పైనా చర్చ జరగ లేదు. నిర్వాహకులు రాసిచ్చిన తీర్మానం కాపీని చదవటమే నాయకులు చేసిన పని. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా చేసిన వాగ్దానాల గురించి గానీ, అందులో ముఖ్యమైన ‘సూపర్ సిక్స్’ గురించి గానీ ఏ చర్చా లేదు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి నట్టున్నారు. 15 నెలల అధికారం కరిగిపోయిన తర్వాత అమలు చేస్తారట! త్వరలో ‘తల్లికి వందనం’ ఇస్తామని చెబుతున్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరపు బకాయి గురించి మాత్రం మాట్లాడటం లేదు. ‘అన్నదాతా సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’, ‘ఆడబిడ్డ నిధి’ వంటి కీలకమైన హామీల సంగతి మాట మాత్రంగానైనా మహానాడులో ప్రస్తావనకు రాలేదు.
మరి మహానాడులో ఏం మాట్లాడారు? తండ్రి–కొడుకుల భజన, ప్రతిపక్ష నేతపై దూషణ... ఈ రెండూ కంపల్సరీ సబ్జెక్టులుగా కనిపించాయి. వీటితో పాటు అసత్య వాణి, మోసపూరిత వైఖరి, వంచనా శిల్పం, అధికార దాహం అనే నాలుగు అంశాలు మహానాడులో అంతర్లీనంగా ప్రవహించాయి.
చరిత్రను వక్రీకరించే విధంగా కృత్రిమ మేధ సాయంతో ఎన్టీఆర్ ’ఆత్మ’ పేరుతో చెప్పించిన మాటల దగ్గర నుంచి మూడు రోజులపాటు జరిగిన అన్ని ఉపన్యాసాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ పట్ల ప్రకటించిన భక్తి, వినయం అన్నీ బూటకమేనని, మోసపూరితమైనవని సభ జరిగిన తీరే తేటతెల్లం చేసింది.
ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం దక్కాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణులతో పాటు తెలుగు ప్రజల్లో చాలామందికి ఎప్పటినుంచో ఉన్నది. ఆ కోరిక మేరకు కనీసం కంటి తుడుపుగా ఒక తీర్మానాన్ని కూడా మహానాడు ఆమోదించలేదు. నిజానికి ఆ పురస్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేగల స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆ పార్టీ మద్దతుపైనే కేంద్ర సర్కార్ ఆధారపడి ఉన్నది.
అయినా చంద్రబాబు ఆ డిమాండ్ చేయరు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను చక్రం తిప్పానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలనే డిమాండ్ మాత్రం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా చేయబోరని మహానాడు మరోసారి నిరూపించింది. ఈ మహానాడులో నందమూరి వంశస్థులు ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. బహుశా వచ్చే మహానాడులో నందమూరి తారక రామారావు బొమ్మ కూడా అదృశ్యం కావచ్చు.
వంచనా శిల్పం కూడా అడుగడుగునా కనిపించింది. ఎన్నికలకు ముందు చేసిన ‘సూపర్ సిక్స్’ను పక్కన పెట్టి యువనేత శాసన ‘సిక్స్’ను ప్రవేశపెట్టారు. ఈ శాసనాలకు రూపకర్తలు ఎవరో చెప్పలేదు గనుక వాటి గురించి ప్రసంగించిన ఆయననే ఏకసభ్య శాసనసభగా పరిగణించాలి. అందులో 1) తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2) యువగళం, 3) స్త్రీ శక్తి,4) పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, 5) అన్నదాతకు అండగా, 6) కార్యకర్తే అధినేత.
ఈ పదబంధాల అర్థతాత్పర్యాలను ఏలినవారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాతే వీటి గుణ దోషాల గురించి మాట్లాడగలుగుతాము. మహానాడులో కనిపించిన మరో అంశం అంతులేని అధికార దాహం. స్వయంగా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి తరతరాలు తమ కుటుంబమే పరిపాలించాలన్న కోరికను ఎటువంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టి చెప్పారు.
ఒకసారి గెలిపించటం మరోసారి ఓడించడం వంటి వైకుంఠపాళీ వద్దని, ఎప్పటికీ తమనే గెలిపించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే లేదని ఆయన మనోగతాన్ని బయటపెట్టారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తి!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com