వృద్ధురాలి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి దారుణ హత్య

Oct 5 2023 2:44 AM | Updated on Oct 5 2023 10:52 AM

- - Sakshi

తూర్పు గోదావరి: కోరుకొండ మండలం కణుపూరులో తల్లోజు పార్వతి (75) దారుణ హత్యకు గురైంది. తన ఇంట్లో మంగళవారం రాత్రి నిద్రించిన ఆమె బుధవారం ఉదయానికి రక్తపు మడుగులో పడి ఉంది. కోరుకొండ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.ఉమా మహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కణుపూరు మెయిన్‌ రోడ్డు బ్రహ్మాలవీధిలో పార్వతి నివాసం ఉంటోంది.

ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన మూడో కుమారుడు వెంకటేశ్వర్లు ఇంట్లో టీవీ సీరియల్‌ చూసింది. అనంతరం నాలుగో కుమారుడు వీరబాబు ఉంటున్న తన ఇంటికి వచ్చి నిద్రించింది. బుధవారం తెల్లవారేసరికి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూజ్‌ బృందాలు వచ్చి ప్రాథమిక ఆధారాలను సేకరించాయి. రక్తపు మరకలు ఉన్న నైటీని ఆ ఇంటి లోపల షెడ్‌లో గుర్తించాయి.

బలమైన కర్రతో కొట్టి..
పోలీసు డాగ్‌ తొలుత ఇంటి నుంచి బయటకు వచ్చి మెయిన్‌ రోడ్డు మీదుగా సమీప ఇంటి వైపునకు పరుగులు తీసింది. తర్వాత మృతురాలి ఇంటి ఆవరణలోని షెడ్డులోకి వెళ్లింది. అనంతరం రోడ్డు మీదకు వచ్చింది. అలాగే క్లూజ్‌ టీమ్‌ ఘటనా స్థలంలో వేలిముద్రలు, మృతిరాలి తలపైనున్న మరకలను పరిశీలించింది. తలపై బలమైన కర్ర లేదా రాడ్డుతో కొట్టి చంపిఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను విచారణ చేస్తున్నారు. తల్లోజు పార్వతికి తొమ్మిది మంది సంతానం. వారిలో ఐదుగురు కూతుర్లు, నలుగురు కుమారులున్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో వేరే గ్రామాల్లో ఉంటున్నారు. కుమారుల్లో చిన్నవాడితో పాటు ఉమ్మడి ఇంట్లో పార్వతి నివసిస్తోంది. ఆమె భర్త సుబ్బారావు గతంలోనే మృతి చెందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement