● జిల్లాలోని నాలుగు డిపోల్లో
276 బస్సులు
● వాటిలో జనం తరలింపునకు కేటాయించినవి 103
● ఈ నెల 31, ఆగస్టు 1న
ప్రయాణికులకు తప్పని అవస్థలు
సాక్షి, రాజమహేంద్రవరం: ఇప్పటికే అరకొర ఆర్టీసీ బస్సులతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులకు అధికారులు మరో భారీ షాకిచ్చారు. ఆగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జన సమీకరణ కోసం జిల్లా నుంచి ఏకంగా 103 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ఉన్న బస్సులే సరిపోక ప్రయాణికులు అల్లాడుతుంటే, ఒక్కసారిగా ఇన్ని బస్సులను ఈ నెల 31, ఆగస్టు 1న భోగాపురం మళ్లించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే పరి స్థితి నెలకొంది. ముఖ్యంగా స్కూళ్లు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, పొట్ట కూటి కోసం జిల్లా కేంద్రా నికి తరలివచ్చే చిరుద్యోగులు ప్రైవేటు వాహనాల ను ఆశ్రయించాల్సిందే. అయితే రెండు రోజుల పాటు బస్సులు మళ్లిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆగస్టు 2న ఆ బస్సు సర్వీసులు నడపడమూ అనుమానమే. అప్పటికే రెండు రోజుల పాటు విధుల్లో ఉండే డ్రైవర్లు మూడో రోజు కూడా విధులు నిర్వర్తించాలంటే కష్టమే. అందువల్ల అనధికారికంగా మూడో రోజూ పూర్తిస్థాయిలో బస్సులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.
అరకొర సర్వీసులతో అవస్థలు
జిల్లాలోని వివిధ డిపోల పరిధిలో రోజూ 30 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలపైనే ఆధారపడతారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, గోకవరం, గోపాలపురం వంటి ప్రాంతాల నుంచి నిత్యం ప్రయాణాలు సాగుతుంటాయి. కొంతకాలంగా తగినన్ని బస్సులు నడపకపోవడంతో ఉన్న సర్వీసులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సీ్త్ర శక్తి పథకం పేరుతో మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నా అందుకు అవసరమయ్యే బస్సులను సమకూర్చలేదు. దీంతో ఇప్పటికే బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. తాజాగా ఉన్న బస్సులను సభకు తరలించడంతో సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిపై డిపో మేనేజర్ మాధవ్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా.. బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశామని, ప్రయాణికులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించా రు. వాడపల్లి వేంకటేశ్వరస్వామి భక్తులు యాత్రను వాయిదా వేసుకోవాలని చెప్పారు.
వాడపల్లి భక్తులకు నరకయాతనే
వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతి శనివారం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 25 వేల మంది భక్తులు తరలివెళుతున్నారు. ప్రస్తుతం తిరుగుతున్న బస్సులు సరిపోక వీరందరూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ శనివారం జిల్లా నుంచి 103 ఆర్టీసీ బస్సులను భోగాపురం వెళ్లే కూటమి శ్రేణుల కోసం కేటాయించేశారు. ఈ పరిస్థితుల్లో భక్తుల పరిస్థితి ఏమిటో తెలియడం లేదు.
కేటాయింపు ఇలా..
డిపో ప్రస్తుత మళ్లించినవి
బస్సులు
రాజమహేంద్రవరం 146 48
గోకవరం 50 24
నిడదవోలు 34 14
కొవ్వూరు 46 17
మొత్తం 276 103


