ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నానుడి. దీనికి తగినట్టుగానే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల మధ్య అసమ్మతి సెగ రోజురోజుకూ రాజుకుంటోంది.
తూర్పు గోదావరి: ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నానుడి. దీనికి తగినట్టుగానే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల మధ్య అసమ్మతి సెగ రోజురోజుకూ రాజుకుంటోంది. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మపై ఆ పార్టీ నేతలు గతంలో అసమ్మతి బావుటా ఎగురవేశారు. సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దే అసమ్మతి పంచాయితీ పెట్టారు. మరోపక్క జనసేనలో కూడా నియోజకవర్గ ఇన్‌చార్జి మార్పు ఆ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతిని లేపింది. పాత నేతలు జోరుగా తిరుగుతున్న సమయంలో కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల్లోని అసమ్మతి నేతలు కలుస్తూండటం ఇరు పక్షాల కార్యకర్తల్లో కలవరం రేపుతోంది.
తంగెళ్ల అండతో..
గత సార్వత్రిక ఎన్నికల తరువాత పిఠాపురంలో జనసేన పార్టీ అసలుందా అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించిన మాకినీడి శేషుకుమారి అడపాదడపా కనిపిస్తూ ఉన్నానని అనిపించుకునే ప్రయత్నాలు చేసేవారు. ఈ పరిస్థితుల్లో జనసేనకు ఆర్థిక అండగా ఉంటూ.. అధినేత వద్ద తన మాటే వేదం అనిపించుకుంటున్న వ్యాపారవేత్త, టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను.. అప్పట్లో పిఠాపురానికి చెందిన కొందరు కొత్త నేతలు కలిశారని చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని, పని తీరు బాగున్న వారికి సీటు ఇప్పించే బాధ్యత తనదని నాడు ఆయన భరోసా ఇచ్చారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన అండతో కొందరు జనసేన నేతలు కొన్ని నెలలుగా అంతా తామే అన్నట్టు ఖర్చు రూపాయి.. ప్రచారం రూ.10 వేలు అనే రీతిలో హడావుడి చేశారు. ఎలాగూ ఉన్న ఇన్‌చార్జిపై అసమ్మతి వ్యక్తం చేయడంతో తమలో ఎవరికో ఒకరికి కచ్చితంగా సీటు వచ్చేస్తుందని ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఎలాగూ తంగెళ్ల మద్దతు ఉంది కాబట్టి తమకిక అడ్డం లేదని భావించారు.
అసమ్మతి వర్గానికి జెల్ల
సరిగ్గా అదే తరుణంలో అసమ్మతి నేతలందరికీ తంగెళ్ల ఓ జెల్ల కొట్టారు. హఠాత్తుగా ఆయనే నేరుగా ఇక్కడ దిగిపోయారు. దీంతో ఈ సీటు కోసం ఆయనను నమ్ముకున్న జనసేన అసమ్మతి నేతలు ఒక్కసారిగా కంగు తిన్నారు. తంగెళ్ల తమను నమ్మించి, నట్టేట ముంచారంటూ అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచీ స్థానిక నేతలు ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తమ అసమ్మతిని బహిరంగంగానే తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్నాళ్ల కిందట జనసేన మాకినీడి శేషుకుమారిని తప్పించి, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు అధినేత పవన్ కల్యాణ్ అప్పగించారు. దీంతో ఆ పదవి ఆశించిన నేతలు భంగపాటుకు గురయ్యారు. ఈ పరిణామాలు ఆ పార్టీలో అసమ్మతిని మరింత రాజేశాయి.
పొత్తులంటూనే..
ఇదిలా ఉండగా స్థానిక జనసేన నాయకులతో సంబంధం లేకుండా కొత్త నేత తంగెళ్ల.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యతిరేక వర్గ నాయకులను కలుసుకుంటున్నారు. రెండు రోజుల కిందట కొంతమంది వర్మ వ్యతిరేక వర్గానికి చెందిన నేతలను నేరుగా కలవగా.. మరికొంత మందితో ఫోనులో చర్చిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత వర్మ కూడా జనసేనలోని అసమ్మతి నాయకులతో లోపాయికారీగా మంతనాలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాలు ఈ రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఒకపక్క పొత్తులంటూనే టీడీపీ, జనసేన నేతలిద్దరూ.. పరస్పరం అవతలి పార్టీలోని అసమ్మతి నేతలకు గాలం వేయాలని చూడటంపై రెండు పార్టీల కార్యకర్తలూ అయోమయానికి గురవుతున్నారు.
టీడీపీ నేతల్లో కలవరం
జనసేన ఇన్‌చార్జి మార్పుతో పిఠాపురం టీడీపీ నేతల్లో అలజడి ప్రారంభమైంది. జనసేనతో పొత్తు కుదిరినా సరే సీటు తనదేనంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించుకున్నారు. ఈ తరుణంలో జనసేన ఇన్‌చార్జిగా తంగెళ్లను నియమించడం, ఆయన వర్మ అసమ్మతి నేతలను వారి ఇళ్లకు వెళ్లి మరీ కలవడం టీడీపీ నేతల్లో కలవరం రేపుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే పిఠాపురం జనసేనకే ఇవ్వాలని కోరినట్టు చెబుతున్నారు. అది కూడా తంగెళ్లకే ఇచ్చేందుకు హామీ ఇచ్చి మరీ ఇన్‌చార్జి పదవి కట్టబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనికెలా అంగీకరిస్తామంటూ టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు రంగం సిద్ధ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
జనసేనకు ఈ నియోజకవర్గం కేటాయిస్తే టీడీపీ రెబల్ బాధ తప్పదని ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క తమకు ఝలక్ ఇచ్చిన తంగెళ్లకు టిక్కెట్ ఇస్తే తామెలా సహకరిస్తామంటూ జనసేన నాయకులూ అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఎవరినో తీసుకువచ్చి టిక్కెట్ ఇస్తే ఓట్లు వేయడానికి సిద్ధంగా లేమని ఆ పార్టీ కార్యకర్తలు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తు సంగతెలా ఉన్నా నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి మార్పు రెండు పార్టీల్లోనూ తీవ్ర కలవరానికి తెర లేపిందనే చెప్పాలి. మరోవైపు టీడీపీలోని వర్మ అసమ్మతి నేతలను తంగెళ్ల కలవడం కూడా ఈ రెండు పార్టీల మధ్య అగ్గి రాజేసిందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
