సాక్షి, తాడేపల్లి: లెక్కా జమ లేకుండా ఏడాదిన్నరలోనే రూ.2.80 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని సీఎం చంద్రబాబు దివాళా అంచున నిలబెట్టాడని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించకపోయినా అప్పులు మాత్రం రూ. 2.80 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు లెక్కలుంటే చూపించాలని శివశంకర్ డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ నుంచి రూ.18 వేల కోట్లు అప్పులు తెచ్చి కూడా మామిడి రైతులకు మద్ధతు ధర కింద చెల్లించాల్సిన రూ. 260 కోట్లు కూడా ఇవ్వలేదని వివరించారు. చంద్రబాబు అప్పుల ద్వారా తెస్తున్న డబ్బంతా ఆయన బినామీల జేబుల్లోకే చేరుతోందని, అప్పులు తెచ్చిన డబ్బుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా కేవలం రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేశారని, అందులోనూ రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 2.80 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క దానికీ బాధ్యతగా లెక్కలు చూపించడం లేదని చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఇళ్ల స్థలాల పంపిణీ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి వాటి ద్వారా వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నాయకులు దోచుకుతింటున్నారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఆ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్‌కి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోనే అప్పులు రూ.2.80 లక్షల కోట్లను మించిపోయాయి. మంగళవారం వారం వచ్చిందంటే అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు రూ.1,58,880 కోట్లు కాగా వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ చేసిన అప్పులు రూ. 71,295 కోట్లు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూనే రాజధాని కోసం చేసిన అప్పు రూ. 47,387 కోట్లు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదు.
రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు సంగతి పక్కనపెడితే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చడం లేదు. పదిహేనో తేదీ వచ్చినా కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు జమ కావడం లేదు. కానీ అప్పు చేసి తెచ్చిన ఈ డబ్బంతా ఏమవుతున్నట్టు అని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఒక్కొక్కరు 70 సార్లకు మించి హైదరాబాద్‌కి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ తెచ్చిన అప్పులతో జల్సాలు చేస్తున్నారు. ఇంకోపక్క చంద్రబాబు తన బినామీలకు రాష్ట్ర సంపదను విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు.
సంపద సృష్టి లేదు.. దోచుకోవడమే
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంకోపక్క మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణాలు, గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లీనిక్‌లు నిర్మించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.
ఈ విధంగా రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద సృష్టించారు. మొత్తంగా ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎల్లో మీడియా మాత్రం రూ.14 లక్షల అప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో జమ చేయడం జరిగింది. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 70 శాతంకిపైగా అప్పులు ఏడాదిన్నరలోనే చేశారు.
మైనింగ్ ఆదాయం తాకట్టు పెట్టి రూ. 9 వేల కోట్లు అప్పు
రైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేకపోయినా మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 18,700 కోట్లు అప్పులు చేశారు. మామిడి రైతులకు మద్ధతు ధర చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రూ.260 కోట్లు చెల్లించాలి. మామిడి రైతులు మద్ధతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. మైనింగ్ ఆదాయాన్ని ప్రైవేటు యాజమన్యాలకు కట్టబెడుతూ రూ. 9 వేల కోట్లు అప్పులు చేశారు. విమానాశ్రయాల కోసం సెంట్ భూమి కొనకపోయినా ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పేరుతో వెయ్యి కోట్లు అప్పులు తెచ్చారు.
ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.5,400 కోట్ల అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే అప్పులు ఎఫ్ఆర్‌బీఎం పరిధికి లోబడి 6.5 శాతంకి మించి వడ్డీ ఉండకూదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి 9.15 శాతం భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఎఫ్ఆర్‌బీఎం పరిధికి లోబడి అప్పులు తెస్తే, వ్యంగ్యంగా హెడ్డింగులు పెట్టి ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తూలనాడింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే దారుణంగా అప్పులు చేస్తుంటే రుణ సమీకరణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తనకిష్టమైన చంద్రబాబు అధికారంలో ఉండటంతో అప్పుల వార్తలను లోపలి పేజీల్లో చిన్నవార్తగా ప్రచురించి మమ అనిపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ సృష్టించిన సంపదను పంచుకుతింటున్నారు. రెండేళ్లు కూడా నిండకుండానే ఏపీని దివాళా అంచున నిలబెట్టారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు.


