80 వేల పుస్తకాల పరిజ్ఞానం అసెంబ్లీలో చూపించాలి... కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు
ఏప్రిల్‌లో రెండో విడత ‘ఇందిరమ్మ’
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సాక్షి, మహబూబాబాద్: ‘ప్రజల మధ్య ఉంటేనే సమస్యలు తెలుస్తాయి.. ఫామ్‌హౌస్‌లో ఉండి ఢాంబికాలు మాట్లాడితే సమస్యలు తెలుస్తాయా.. అసెంబ్లీలో చర్చించేందుకు రావాలి’ అని రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి నూకల రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకోవడం కాదని, ఆ పరిజ్ఞానం అసెంబ్లీలో ప్రజలకోసం మాట్లాడటంలో చూపించాలని కోరారు. ఓడిపోయిన తర్వాత రెండేళ్లు ఫాంహౌస్‌లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి కారుకూతలు కూస్తే ప్రజలు నమ్మరని అన్నారు.
రేవంత్‌రెడ్డి పాలనను మెచ్చి పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించారని చెప్పారు. కేవలం 25 శాతం గెలిచిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల కోసం మహబూబాబాద్ వచ్చి కేటీఆర్ గొప్పలు చెప్పకోవడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టంచేశారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి నాలుగుసార్లు మంత్రిగా పనిచేసి తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడిన నూకల రాంచంద్రారెడ్డి తెలంగాణ గరి్వంచదగిన నాయకుడని పొంగులేటి కొనియాడారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవిందర్‌రావు, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
జీఓలో అవసరమైతే మార్పులు
ఖమ్మం రూరల్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే జర్నలిస్టులకు అత్యధికంగా అక్రిడిటేషన్ కార్డులు అందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. శనివారం టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జీవో 252లో పొరపాట్లు ఉన్నా, మార్పులు అవసరమనిపించినా సరి చేస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల విషయంలో ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే కార్డుల మధ్య ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. డెస్క్ కార్డులున్న వారికి కూడా ఫీల్డ్ మీడియా కార్డులతో సమానంగా అన్ని సౌకర్యాలు కలి్పస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.


