ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకునే పనిలో ఉన్నారు
కాంగ్రెస్, సీఎం రేవంత్‌రెడ్డి అంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, మహబూబాబాద్: ‘దొంగమాటలు చెప్పి అడ్డదారిలో సీఎం అయిన రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లను శనివారం జిల్లాకేంద్రంలో కేటీఆర్ సన్మానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 45 శాతం ఓటింగ్ బీఆర్‌ఎస్ మద్దతుదారులకు పడిందన్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకునే పనిలో ప్రజలు ఉన్నారని చెప్పారు. రాష్ట్రావ్యాప్తంగా 1500 మందికిపైగా బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు ఉన్నారని చెప్పారు.
వీరిపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ అని.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్ అని.. తర్వాత ఫైనల్ పోటీతో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ బయటకువచ్చి సమీక్షలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుట్టిందని చెప్పారు. సీఎం భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఆయనకు ఒకటే భాష వచ్చని, తనకు నాలుగు భాషలు వచ్చని.. అన్ని భాషల్లో తిట్టవచ్చు కానీ, సంస్కారం అడ్డం వచ్చిందని చెప్పారు.
తాను గుంటూరులో చదువుకున్నానని చెప్పిన రేవంత్‌రెడ్డి అల్లుడిది భీమవరం కాదా అని ప్రశ్నించారు. నాలున్నర దశాబ్ధాల క్రితం చనిపోయిన మహానాయకుడు నూకల రాంచంద్రారెడ్డిని గుర్తుచేసి విగ్రహం ఆవిష్కరణకు శంకుస్థాపన చేసింది కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే గొంతును నొక్కే కుట్ర
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయాల్సిందిపోయి, ఉన్న వాటిని తొలగించడంపై కేటీఆర్ మండిపడ్డారు. వారి ఉపాధిని, ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే జర్నలిస్టుల గొంతును పోలీసు బలగాలతో నొక్కేసే కుట్ర చేస్తోందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై శాంతియుతంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన టీయూడబ్ల్యూజే– టీజేఎఫ్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల పునరుద్ధరణ కోసం సాగే పోరాటంలో బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు.


