పుత్తూరు: పట్టణంలోని బెస్తవీధి, బండ్లదొడ్డి వీధిలో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. మొత్తం 5 ఇళ్ల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బండ్లవీధిలోని జి.శేషాద్రి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి, పక్కనే ఉన్న మరో ఇంటిలో నిద్రించాడు. తాళం వేసిన ఇంటిలోకి చొరబడిన దుండగులు బీరువాలోని 8 గ్రాముల బంగారు నగలు, 3 పట్టుచీరలు చోరీ చేశారు. సమీపంలోని మంగమ్మ ఇంట్లోనూ చోరీకి పాల్పడ్డారు. మంగమ్మ ఊర్లో లేకపోవడం వల్ల ఆ ఇంట్లో ఏవస్తువులు చోరీకి గురయ్యాయో తెలియడం లేదు. బెస్తవీధిలోని మురళియమ్మ, ట్యూషన్ రఘు, దాము ఇళ్ల తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఈ మూడిళ్లలోనూ విలువైన వస్తువులు పోలేదు. శేషాద్రి తన ఇంట్లో జరిగిన దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగేంద్రబాబు సిబ్బందితో కలిసి అన్ని ఇళ్లలోనూ పరిశీలించారు.
బెంబేలెత్తుతున్న జనం
పుత్తూరు పట్టణ నడిబొడ్డులో ఉన్న లక్ష్మీనగర్ కాలనీలో ఆర్.నిర్మల అనే మహిళ ఇంట్లో గత జూలై 17వ తేదీన దొంగలు పడి 124 గ్రాముల బంగారు నగలు, 1100 గ్రాముల వెండి వస్తువులు, రూ.1.18 లక్షల నగదు కలిపి సుమారు రూ.20 లక్షల సోత్తును చోరీ చేశారు. అదే నెల 29వ తేదీన ఎస్బీఐ కాలనీలోని సుబ్రమణ్యం అనే టీచర్ ఇంటి తలుపులు తట్టి హల్‌చల్ చేశారు. గురువారం రెండు వీధుల్లోని ఐదు ఇళ్లలో దొంగలు పడడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని కోరుతున్నారు.
బీరువాలోని నగలు దోచుకెళ్లారని చూపుతున్న శేషాద్రి


