కాలం చెల్లిన పాలతో చెలగాటం పిల్లలకు పౌష్టికాహారం అంతంత మాత్రమే ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ఎక్కడ..? పర్యవేక్షణ ఏదీ..? అధికారుల్లో కొరవడిన జవాబుదారీతనం
అంగన్‌వాడీల్లో
చిత్తూరు అర్బన్: జిల్లాలోని 2420 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 19,860 మంది గర్భిణులు, బాలింతలకు బాల సంజీవని నుంచి బియ్యం, పప్పు, వంటనూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం, వేరుశనగ చిక్కీలు, ఎండు ఖర్జూరాలు అందజేయాలి. ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సున్న 56,131 మంది పిల్లలకు బాలామృతంతో పాటు కోడిగుడ్లు 25, పాలు 2.5 లీటర్లు, 3–5 ఏళ్ల వయస్సున్న 37,454 మంది పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే మధ్యాహ్న భోజనం, రోజూ ఒక కోడిగుడ్డు, 100 ఎంఎల్ పాలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ లెక్కలు ఏమాత్రం సరిపోలడంలేదు. కొన్నిచోట్ల గర్భిణులకు మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందడంలేదు. మరికొన్ని చోట్ల కోడిగుడ్ల బరువులో తేడా ఉండడం, పౌష్టికాహారంలో పోషకాలు లేకపోవడం సర్వసాధారణమైపోయింది. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా నెలల తరబడి చెడిపోయిన పాలే బాలింతలకు అందుతున్నా పట్టించుకునే దిక్కులేదు. దీంతో బాలింతలు, పిల్లలు, గర్భిణులు అనారోగ్యం బారిన పడుతున్న ట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తనిఖీలు చేయని అధికారులు
చిత్తూరు జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో జవాబుదారీతనం కొరవడింది. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఇస్తున్న ఆహార పదార్థాల్లో పోషకాల విలువలు కనిపించడం లేదు. కాలం చెల్లిన పదార్థాలు అందజేసి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చిత్తూరులో ఇటీవల గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసిన దాదాపు 30 లీటర్ల పాలు చెడిపోవడమే ఇందుకు నిదర్శనం.
బాలింతలు, గర్భిణులు, పిల్లలకు అందుతున్న ఆహార పదార్థాల్లో నాణ్యత, పోషకాల పరిస్థితిని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో పాటు ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలి. ఇది తూతూమంత్రంగా జరగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యతను ఏ ఒక్కరూ తనిఖీలు చేయడంలేదనే విమర్శలున్నాయి. కొన్ని కేంద్రాల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నా ఎక్కువ మందిని చూపించి రేషన్ దిగమింగడం సర్వసాధారణమైపోయింది.


