గడువులోగా పూర్తి చేయాలి ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

గడువులోగా పూర్తి చేయాలి ‘సర్‌’

Aug 21 2026 9:50 AM | Updated on Aug 21 2026 9:50 AM

● జిల్లా ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ మల్లికార్జున వెల్లడి ● కలెక్టరేట్‌లో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

చిత్తూరు కలెక్టరేట్‌ : సర్‌ ప్రక్రియను గడువులోపు పకడ్బందీగా పూర్తి చేయాలని రోల్‌ అబ్జర్వర్‌ మల్లికార్జున ఆదేశించారు. ఆయన గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సర్‌ ప్రక్రియను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (సర్‌) ప్రక్రియను పకడ్బందీగా, గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా పెండింగ్‌లో ఉన్న సుమారు 20 వేల నోటీసులను ఆగస్టు 22 నాటికి పూర్తి స్థాయిలో డెలివరీ చేయాలని ఆదేశించారు. కుప్పం నియోజకవర్గంతో పాటు పుంగనూరు, జీడీ నెల్లూరు, పలమనేరులో ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఏఈఆర్‌ఓలు నోటీసులకు సంబంధించిన వివరాలను, హియరింగ్స్‌ను తప్పనిసరిగా పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఓటర్లు అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులకు నోటీసు ఇవ్వడం, వీడియో కాల్‌, వాట్సాప్‌ ద్వారా సంప్రదించాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు సాధ్యమైనంత వరకు ఒకే రోజు హియరింగ్‌ నిర్వహించాలని తెలిపారు. అలాగే ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్‌ స్టేషన్లలో ఉంటే, ఫారం–8 ద్వారా దరఖాస్తు చేయించి ఒకే చోటకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్‌తో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారం 6లు 8 వేలు, ఫారం 8 లు 6 వేలు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరుకూ ఇబ్బంది కలగకుండా, పారదర్శకమైన సేవలు అందించాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, డీఆర్వో మోహన్‌ కుమార్‌, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement