జిల్లాలో తగ్గని భానుడి భగభగలు
చిత్తూరు నగరంలోని జీకేపురం వద్ద ఎండిపోయిన పశుగ్రాసం
చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లి వద్ద ఎండిపోయిన వేరుశనగ పంట
కాణిపాకం: వర్షాభావ పరిస్థితులు జిల్లాలోని వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణంగా ఈ పాటికి 21 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు కావలసి ఉండగా, వర్షాలు లేక 93 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు పడ్డాయి. వాటిలో సుమారు 40 నుంచి 50 ఎకరాల్లోని పంట నీరులేక ఎండిపోయింది. మిగిలిన స్వల్ప విస్తీర్ణంలోని పంట బోరుబావుల నీటితో అరకొరగా ఊపిరి పీల్చుకుంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు పండ్ల రారాజుగా పేరుగాంచిన మామిడి తోటల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. జిల్లాలో మొత్తం 59 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉండగా, నీటి ఎద్దడి కారణంగా ఇప్పటికే సుమారు 10 వేల హెక్టార్లలో చెట్లు ఎండిపోయి చనిపోతున్నాయి. రెండు నెలల కాలంలో తోటల్లో చెట్లు ఎండిపోయే తీవ్రత పెరిగింది. మామిడి పంట దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఇక్కడి రైతులతో పాటు బెంగళూరులో స్థిరపడిన స్థానిక రైతులు కూడా కొబ్బరి సాగు వైపు దృష్టి సారించారు. ఎల్‌నినో ధాటికి కొబ్బరి తోటలు కూడా తప్పించుకోలేకపోతున్నాయి. జిల్లాలో ఉన్న 4,361 హెక్టార్ల కొబ్బరి తోటల్లో వర్షాధారమైన 1,500 హెక్టార్ల తోటలు తీవ్ర నీటి ఎద్దడితో వాలిపోతున్నాయి. మట్టలన్నీ వాడిపోయి, పొలం గట్లపై ఉన్న చెట్లు నేలకొరిగే దయనీయ స్థితికి చేరాయి. తక్షణమే వర్షం కురవకపోతే కొబ్బరి రైతులకు తీవ్ర గడ్డుకాలం తప్పదని రైతులు కుమిలిపోతున్నారు.
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండిపోయి, చెరువులు అడుగంటినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా అధికారులను పంపలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎండిపోయిన పంటలకు, దెబ్బతిన్న తోటలకు ఎకరాకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఎండిపోయిన 2 వేల చెరువులు
చిత్తూరు మండలం బండపల్లి సమీపంలో
ఎండుముఖం పడుతున్న కొబ్బరి చెట్లు
చిత్తూరు మండలం కృష్ణాపురం వద్ద
ఎండిపోయిన మామిడి చెట్లు
ఎల్‌నినో రాకాసి ప్రభావంతో ఆకాశంలో మబ్బులు చాటేశాయి. వరుణుడు కనికరించనంటున్నాడు. ఎండలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి. పొలాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు భూగర్భ జలమట్టం ఏకంగా 16 మీటర్ల లోతుకు పడిపోవడంతో సాగునీటికే కాకుండా తాగునీటికీ తిప్పలు తప్పడం లేదు. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రకృతి ఇంతలా పగబట్టి రైతాంగాన్ని, ప్రజలను కష్టాల కడలిలోకి నెడుతున్నా అధికార యంత్రాంగంలో చలనం కనిపించడం లేదు. ప్రభుత్వం సాయం అందించే దిశగా ఒక్క అడుగూ ముందుకు వేయకపోవడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.


