కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారుల పర్యవేక్షణలో పనులను వేగవంతం చేశారు. ఆలయ ప్రాంగణంలో రంగులు వేయడం, అవసరమైన మరమ్మతు పనులను చేయిస్తున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
సమన్వయంతో
బ్రహ్మోత్సవాల నిర్వహణ
తిరుమల: ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండడంతో జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ఎం.రవిచంద్ర తెలిపారు. ఆయన గురువారం అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను నిల్వ ఉంచాలని చెప్పారు. గరుడ వాహనం రోజున అధిక మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం సి.హెచ్.వెంకయ్యచౌదరి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని 25 రాష్ట్రాల నుంచి 27 కళాబృందాలు పాల్గొననున్నాయని తెలిపారు. సమావేశంలో టీటీడీ జేఈవోలు డాక్టర్ శరత్, ప్రభల గోపీనాథ్ పాల్గొన్నారు.


