ప్రశ్నించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు! | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు!

Aug 19 2026 12:24 AM | Updated on Aug 19 2026 12:24 AM

నగరి : రోడ్డుపై కంటైనర్‌ కారణంగా జరిగిన చిన్నపాటి ఘటనను ప్రశ్నించేందుకు వెళ్లిన ఓ కారు డ్రైవర్‌ చివరకు అదే లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన సోమవారం రాత్రి నగరి మండలంలో జరిగింది. లారీ డ్రైవ ర్‌ అతివేగం, నిర్లక్ష్యం, ఆపకుండా వెళ్లిపోవడం కారణంగా నారాయణ (36) అనే వ్యక్తి దుర్మరణం చెందడం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. సోమవారం తిరుపతి జిల్లా కొర్లగుంట మారుతీనగర్‌కు చెందిన నారాయణ ఇన్నో వా కారుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆరుగురు యాత్రికులను తీసుకుని తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లి దర్శనం చేయించిన అనంతరం వేలూరు, కాంచీపురం ఆలయాలను సందర్శించి తిరిగి తిరుపతికి వస్తున్నాడు. ఈ క్రమంలో తమిళనాడు సరిహద్దులోని ఆర్‌టీ ఓ చెక్‌పోస్ట్‌ వద్ద ఇన్నోవాను తనిఖీ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ లారీ కారు కుడివైపును రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో తన వాహనానికి జరిగిన నష్టంపై ప్రశ్నించేందుకు నారాయణ ఆ కంటైనర్‌ లారీని వెంబడించాడు. నగరి మండలం వీకేఆర్‌ పురం సమీపంలోని ఎక్స్‌ప్రెస్‌ హైవే రింగ్‌ రోడ్డు వద్ద లారీని ఓవర్‌టేక్‌ చేసి కొంత దూరంలో ఇన్నోవాను నిలిపాడు. అనంతరం రోడ్డును దాటి లారీ డ్రైవర్‌ను ప్రశ్నించి వస్తానని కారులోని ప్రయాణికులతో చెప్పి వెళ్లాడు. నారాయణ చాలా సమయం వరకు రాకపోవడంతో ఇన్నోవాలోని యాత్రికులు ముందుకు వెళ్లి చూడగా రోడ్డుపై నుజ్జు నుజ్జుగా మారిన మృతదేహంగా కనిపించాడు. దీంతో వెంటనే నగరి పోలీసులకు సమాచారం అందించారు. హైవే మొబైల్‌ పోలీసులు, నగరి ఎస్‌ఐ ఘట నా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కంటైనర్‌ లారీ డ్రైవర్‌ వ్యవహరించిన తీరు, ప్రమాదం అనంతరం లారీ ఆపకుండా వెళ్లిపోయిన అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కంటైనర్‌ డ్రైవర్‌ను ప్రశ్నించేందుకు నారాయణ లారీలోకి ఎక్కే సమయంలో వాహనం ముందుకెళ్లడంతో అదుపు తప్పి టైర్‌ కింద పడిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమా దం జరిగిన తర్వాత కూడా లారీని ఆపకుండా డ్రైవర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం మాత్రమే కాకుండా ప్రమాదం జరిగిన అనంతరం బాధితుడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నారాయణ నడుపుతూ వచ్చిన కారు

రోడ్డుపై పడివున్న

నారాయణ మృతదేహం

ఇంతకీ ఆ కంటైనర్‌లో ఏముంది?

ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఆ కంటైనర్‌లో ఏముంది? అనే సందేహం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. సాధారణంగా రవాణా వాహనాలను తనిఖీ చేసే ప్రాంతంలో కంటైనర్‌ ఆగకపోవడం, అనంతరం జరిగిన ఘటనలోనూ ఆపకుండా వెళ్లిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంటైనర్‌లో ఏ సరుకు ఉందో, దాని రవాణాకు సంబంధించిన పత్రాలు ఏంటో, వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో వంటి వివరాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలోని కెమెరా ఫుటేజీ, టోల్‌గేట్‌ రికార్డులు పరిశీలిస్తే కంటైనర్‌ ప్రయాణానికి సంబంధించిన కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement