పెచ్చుమీరుతున్న పాలకమండలి
సభ్యుల విచ్ఛలవిడితనం
బంధువులు, స్నేహితులకు అడ్డగోలుగా ఉచిత దర్శనాలు
రూ.1,000 టిక్కెట్‌కు మంగళం
నోరెత్తేందుకు జంకుతున్న సిబ్బంది
విఘ్నేశ్వరుడి సన్నిధిలో అక్రమాల విఘ్నాలు
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో కొందరు పాలక మండలి సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తూ తమ వారికి దర్శనాలు కల్పిస్తున్నారు. సాధారణంగా ఒక భక్తుడు స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుని వేదపండితుల ఆశీర్వచనం, కండువా, ప్రసాదం, చిత్రపటం పొందాలంటే రూ.1,000 టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు పాలక మండలి సభ్యులు ఈ ఆదాయానికి గండి కొడుతున్నారు. తమ కుటుంబ సభ్యులే కాకుండా చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులను కూడా ఉచిత దర్శనాలకు తీసుకెళ్తున్నారు. రూ.1,000 టిక్కెట్‌కు ఇచ్చే కండువాలు, లడ్డూలు, ఆశీర్వచనాలను ఉచితంగా ఇప్పిస్తున్నారు. దీనిపై పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది కూడా మండిపడుతున్నారు.
ప్రశ్నిస్తే బెదిరింపులు
పాలకమండలి సభ్యుల విచ్ఛలవిడితనానికి అధికా ర పార్టీ అండదండలు తోడుకావడంతో ఆలయ సిబ్బంది కనీసం ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. ఎవరైనా నిబంధనలు గుర్తుచేస్తే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఉద్యోగాలు ఊడదీయిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నార ని ఆలయ ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.
గత పాలకమండలి ఆదర్శం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పాలకమండలి సభ్యులు ఆలయాభివృద్ధికి విశేషంగా పాటుపడ్డారు. క్షేత్రానికి సరికొత్త శోభను తీసుకురావడంతో పాటు భక్తుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కృషి చేశారు. దాతలను భాగస్వాములను చేస్తూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టించారు. రాజకీయాలకు అతీతంగా సామాన్య భక్తులకు దర్శన సేవలు అందించగా, ముఖ్యమైన వ్యక్తులు, దాతలకు పరిమిత స్థాయిలో ప్రత్యేక సేవలు కేటాయించేవారు. కండువాలు, ఉచిత ప్రసాదాల పంపిణీలోనూ ఏనాడూ జోక్యం చేసుకోలేదని, నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని ప్రస్తుత అధికార పార్టీ నేతలు, ఆలయ సిబ్బందే బహిరంగంగా వ్యాక్యానిస్తుండడం గమనార్హం.
భక్తుల విఘ్నాలు తొలగించే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దివ్యక్షేత్రం కొందరు పాలకమండలి సభ్యుల స్వార్థానికి, కక్కుర్తికి నిలయంగా మారుతోంది. సామాన్య భక్తులకు నిబంధనల పేరుతో తిప్పలు పెడుతున్న పెద్దలు.. తమ అనుచరులు, బంధుమిత్రుల కోసం ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ నిబంధలనకు తిలోదకాలు ఇస్తున్నారు. ఆశీర్వచనాలు ఇప్పిస్తూ ఆలయ ఆదాయానికి భారీ గండికొడుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పీఆర్‌వో ఆఫీసులో ఇష్టానుసారం
ఆలయ పీఆర్‌వో కార్యాలయంలో కూడా కొందరు దర్శనాల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీగా దర్శనాలకు తీసుకొస్తున్న వ్యక్తులు ఎవరు? ఏ హోదాలో, ఏ ప్రోటోకాల్ ప్రకారం వస్తున్నారనే కనీస సమాచారం కూడా లేకుండానే లోపలికి పంపుతున్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు కూడా వీరి తీరును చూసీచూడనట్లు వ్యవహరించడంపై ఆశ్చర్యం కలుగుతోంది. ఈ అక్రమాలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇప్పటికై నా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, కాణిపాకం క్షేత్రంలో విచ్ఛలవిడి దర్శనాలకు చెక్ పెట్టి, పారదర్శకత పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.


