ఐరాల: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. మండలంలోని అగరంపల్లె జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం యువజన దినోత్సవం– నెలవారీ కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ రక్షణ హక్కు ఉందని తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా స్పందించాలని సూచించారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే వన్ స్టాప్ సెంటర్ ద్వారా వైద్య, న్యాయ, పోలీసు, కౌన్సెలింగ్ సాయం ఒకే చోట ఉచితంగా అందిస్తామని చెప్పారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థి దశ అనేది భవిష్యత్‌కు బంగారు బాట వంటిదని, విద్యార్థులు గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సతీష్‌కుమార్, ఎస్‌ఐ నరసింహులు, వన్‌స్టాప్ సెంటర్ ఏఓ చందురాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


