జాగ్రత్తలతో ఏనుగుల నుంచి రక్షణ
తెలుపు, ఎరుపు దుస్తులు
ఏనుగులకు అసలు పడవు
మనిషి చెమట వాసనను
పసిగడతాయి
ఏనుగు దాడికి రాగానే
దుస్తులను తీసి పడేయాలి
పొలాల్లో మిరప ఘాటు పెడితే ఏనుగులు అసలు రావు
కర్ణాటకకు చెందిన ఏనుగుల స్పెషలిస్ట్ రుద్రాదిత్య
పలమనేరు: జిల్లాలోని కౌండిన్య అభయరాణ్యంలో ఉన్న ఏనుగులు తరచూ అడవిని దాటి పంటపొలాలు, జనావాసాల్లోకి వచ్చి దాడులకు దిగుతున్నాయి. ఇప్పటి దాకా 20 మందికి పైగా మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అటవీశాఖ అధికారులు గతంలో సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగ్గాలేకపోవడంతో ఏనుగులు ఫెన్సింగ్‌ను తొక్కి బయటకు వచ్చేస్తున్నాయి. ఎలిఫెంట్ ఫ్రూప్ ట్రెంచిలను కొట్టించినా ఫలితం లేదు. ఆపై కర్ణాటక మోడల్ అంటూ సిల్వర్‌వైర్లను వేలాడే ఫెన్సింగ్‌ను పెట్టినా ఉపయోగం లేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం పలమనేరు మండలంలోని ముసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆరు కుంకీ ఏనుగులను తీసుకువచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఈ ప్రాంతంలోని అటవీ సమీప గ్రామాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. బహిరంగ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్రంలో ఏనుగుల సమస్యపై అనుభవం ఉన్న సెంటింస్ట్ రుద్రాదిత్య ద్వారా అటవీ సమీప గ్రామమైన టి.వడ్డూరులో బుధవారం ఏనుగుల దాడులను తప్పించుకునే మార్గాలపై మానవ–ఏనుగు సంఘర్షణ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఏనుగులకు తెలుపు, ఎరుపంటే ఆగ్రహం
ఏనుగులకు తెలుపు, ఎరుపు రంగులంటే చాలా కోపమని రుద్రాదిత్య తెలిపారు. అందుకే ఏనుగులు విద్యుత్ స్తంభాలు, తెల్లటి పీవీసీ పైపులు, డ్రిప్పు సిస్టం, ట్రాన్స్‌ఫార్మర్ బాక్సులను ధ్వంసం చేస్తాయన్నారు. ఎవరైనా తెలుపు, ఎరుపు దుస్తులు ధరిస్తే ఏనుగులు వారినే వెంటాడతాయన్నారు. భారీగా శబ్దాలు చేయడం, బాణసంచా పేల్చడం, టైర్లు కాల్చి వాటిపైకి విసరడం, రణగొణ ధ్వనులు చేయడం వంటి వాటిని ఏనుగులు సహించవన్నారు.
ఏనుగు వచ్చినప్పుడు
వేసుకున్న బట్టలు తీసేయాలి
మనిషి చెమట వాసన ద్వారా ఏనుగు పసిగడుతుందన్నారు. వందమీటర్ల దూరంలో జరిగే విషయం కూడా ఏనుగు కళ్లకు సృష్టంగా కనిపిస్తుందని, దాని రెటీనా క్యూడీ కెమెరాకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని రుద్రాదిత్య పేర్కొన్నారు. ముందరి కాళ్లు సెన్సార్లలా పనిచేస్తాయని వివరించారు. అవి తమ ముందు కదలికలను కనిపెడతాయని తెలిపారు. ఉన్నట్టుండి ఏనుగు తరుముకోగానే మనం వేసుకున్న షర్టు, ప్యాంటు లేదా టోపీ, టవల్ లాంటివి కిందపడేసి వెళ్లాలని తెలిపారు. వాటిపై ఏనుగు దాడి చేస్తూ మనిషిని వదిలేస్తుందన్నారు. అసలు మనిషిని చంపాలనే ఆలోచన ఏనుగులకు ఉండదని, తనను ఏమో చేస్తారనే భయంతో సెల్ఫ్ డిఫెన్స్ కోసమే దాడి చేస్తాయని వివరించారు.
ఏనుగులు పొలాల్లోకి రాకూడంటే...
అడవికి ఆనుకుని ఉన్న రైతుల పొలాల్లోకి ఏనుగులు రాకూడదంటే మిరపకాయలను ఓ గోనె సంచిలో కట్టి దాన్ని కొయ్యకు కట్టి నిప్పు పెట్టాలని రుద్రాదిత్య తెలిపారు. ఆ మిరప కాయల ఘాటును ఏనుగులు ముందుగానే పసిగట్టి ఆ ప్రాంతానికి రావన్నారు. అంతేకాకుండా ఘీంకారాల ద్వారా మిగిలిన గుంపునకు సంకేతాలు ఇస్తాయని పేర్కొన్నారు. రైతులు సాయంత్రం వేళల్లో పొ లాల వద్ద మిరపకాయల పొగ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో విజయవంతమైందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎఫ్‌ఆర్వో చాంప్లానాయక్, ఎఫ్‌ఎస్వో సుకుమార్, బీట్ ఆఫీసర్ కిరణ్, పలువురు రైతులు పాల్గొన్నారు.


