ఉపాధి హామీలో అవినీతి పుట్ట | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీలో అవినీతి పుట్ట

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

రైతుల డబ్బులను తినేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌

కూలీలు కూడా వారానికి రూ.200లు ఇవ్వాల్సిందే

మామూళ్లు ఇవ్వని వారికి

పనులు కల్పించని వైనం

ఎంపీడీవోకు రైతుల ఫిర్యాదు

విచారణకు ఆదేశించిన ఎంపీడీవో శిరీష

గుడిపాల: మండలంలో ఉపాధి హామీ (వీబీజీరామ్‌జి) పథకంలో రోజురోజుకూ అవినీతి పెచ్చుమీరుతోంది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతుల పేరుతో పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి బిల్లులు స్వాహా చేస్తున్నారు. అంతటితో ఆగక పనులు చేసిన కూలీల నుంచి వారానికి రూ.200 వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వారికి పనులు కల్పించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో చీలాపల్లె పంచాయతీకి చెందిన కొంతమంది రైతులు బుధవారం ఎంపీడీవో శిరీషకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె ఏపీవో, టెక్నికల్‌ అసిస్టెంట్లను పిలిపించి మాట్లాడారు. ఉపాధిహామీ పనులపైనే ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉండగా రైతులు అధిక సంఖ్యలో వచ్చి ఫిర్యాదులు చేసేంతవరకు మీరు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే విచారణ చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు.

డబ్బులిస్తేనే రైతులకు బిల్లులు

ప్రభుత్వం ఉపాధి హామీ కింద మామిడి, కొబ్బరి మొక్కలు నాటుకున్న రైతులకు మూడేళ్ల పాటు ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. ఫీల్డ్‌ అసిస్టెంట్లు మొక్కలు నాటుకున్న రైతుల పొలాల వద్దకు వెళ్లి ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత బిల్లులు మంజూరుకాగానే నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. తమకు మామూళ్లు ఇస్తేనే బిల్లులు పెడతామని, లేకుంటే పెట్టేది లేదని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తమను వేధిస్తున్నాడని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement