చిత్తూరు అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో టీడీపీ నేతలకు ప్రత్యేక వెలుసుబాటు కల్పిస్తున్నారు. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచురించిన ‘సర్’ ముసాయిదాలో వాస్తవంగా ఉన్న ఓటర్ల పేర్లు వేలల్లో తొలగించారు. వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి పేర్లను మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతలకు మాత్రం రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉండడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం టీడీపీ నేత ఎన్.జయప్రకాష్ నాయుడు చిత్తూరులో మద్యం బార్, హోటళ్లు నడుపుతూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఇతని భార్య బంగారుపాళ్యంలో టీడీపీ నుంచి జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. వీరి ఆస్తులు చిత్తూరు, బంగారుపాళ్యంలో ఉన్నాయి. ఆస్తుల్లాగే ఓట్లు కూడా రెండు చోట్లా ఉండాలనుకుని శాసించినట్టు ఉన్నారు. అందుకేనేమో వారికి చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. చిత్తూరు సాయినగర్ కాలనీలో జయప్రకాష్‌నాయుడు, అతని భార్య సుచిత్రతో పాటు ఇతని బంధుగణం మొత్తం ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇదే సమయంలో పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలంలో కూడా ఓటర్లుగా ఉన్నారు. మ్యాపింగ్ కలవడం లేదనే సాకుతో సామాన్యుల ఓట్లు తొలగిస్తున్న అధికారులు టీడీపీ నేతలకు మాత్రం ప్రత్యేక వెసులుబాటు కల్పించడంపై ఏం పద్ధతి ‘సర్’ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూతలపట్టులో ఉన్న ఓట్లు
చిత్తూరు జాబితాలో జయప్రకాష్ నాయుడు కుటుంబం ఓట్లు


