చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సమరానికి సన్నాహాలు షురూ అవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. ఏప్రిల్ 4తో గ్రామ పంచాయతీల పాలకవర్గం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం సెప్టెంబర్ 25తో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం సర్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడంతో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. వాటి పరిష్కారం పూర్తయ్యాక అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించనుంది. ఆ జాబితా ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పంచాయతీల్లో వార్డుల విభజన, జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలను పంచాయతీలతో మ్యాపింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఉమ్మడి జిల్లాను విభజించి కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటుచేసే అవకాశం ఉంది.
పోలింగ్ కేంద్రాలకు కసరత్తు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలు, 877 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత జెడ్పీ సమావేశాలకు జెడ్పీటీసీలు మూడు జిల్లాల నుంచి వస్తున్నారు. జెడ్పీటీసీల పదవీ కాలం సెప్టెంబర్ 25తో ముగియనుంది. ఆలోపు జెడ్పీని మూడుగా విభజన చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పరిశీలన, ఆన్‌లైన్ డేటా అప్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేసి, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
24లోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాను సిద్ధం చేసి, 23న ప్రచురించనున్నారు. దీనిపై అభ్యంతరాలు, వినతులను ఈనెల 26 వరకు స్వీకరిస్తారు. అనంతరం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత ఆగస్టు 31న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారికంగా ప్రచురిస్తారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఈనెల 18 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఇది 24వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నెల 25న డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇస్తారు. 26 నుంచి 28 వరకు అభ్యంతరాల స్వీకరణ, తదుపరి సెప్టెంబర్ 2 వరకు అభ్యంతరాల పరిశీలన, 6న తుది జాబితా రూపొందించి 7వ తేదీన ప్రచురిస్తారు.
మొదలైన
జిల్లాలో 27 మండలాలు, 622 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 5,906 వార్డులు ఉన్నాయి. వీటిలోని 10,26,821 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధిక ఓట్లు మహిళలవే. పురుష ఓటర్లు 5,07,703 మంది, మహిళా ఓటర్లు 5,19,091 మంది కాగా 11,388 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితా మేరకు పురుష ఓటర్ల ఆధిపత్యం 4 మండలాల్లో మాత్రమే ఉంది. జీడీనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో పురుషులు 18,368 మంది, మహిళలు 18,232 మంది, కుప్పం నియోజకవర్గంలో గుడుపల్లెలో పురుషులు 17,824 మంది, మహిళలు 17,714 మంది, కుప్పంలో పురుషులు 29,355 మంది, మహిళలు 29,000 మంది, పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె మండలంలో పురుషులు 21,990 మంది, మహిళలు 21,964 మంది ఉన్నారు. మిగిలిన 23 మండలాల్లో మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య 27గా గుర్తించగా అందులో కుప్పంలో 8 మంది ఉన్నారు. బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, పులిచెర్ల, పూతలపట్టు, ఎస్‌ఆర్‌పురం, తవణంపల్లె, వెదురుకుప్పం, యాదమరి, గుడుపల్లె, రామకుప్పం, కార్వేటినగరంలో 1–2 మంది వరకు ఉండగా మిగిలిన మండలాల్లో ఒకరు కూడా ట్రాన్స్‌జెండర్లు లేరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకు ప్రాధాన్యత దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు రాజకీయ పార్టీల నుంచి అధిక వాటాను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. గత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలకు అవకాశం ఇవ్వడంతో మహిళా పక్షపాతిగా ముద్రపడ్డారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అతివలకు 50 శాతం దాకా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇచ్చారు. అభివృద్ధి పనుల్లోనూ ప్రాధాన్యత ఇచ్చి గౌరవించారు. గత ఐదేళ్లలో స్థానిక పాలనలో మహిళలకు గౌరవం దక్కింది.
జిల్లాలో 11,388
పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి నగారా మోగనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణ, వార్డుల విభజన ప్రక్రియపై దృష్టిసారించారు. ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడం, త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో పల్లెల్లో రాజకీయ వేడి మొదలైంది.
వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం
చిత్తూరు జిల్లాలోని 27 మండలాల పరిధిలో 622 పంచాయతీలున్నాయి. మరో 10 కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఒక గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకూ ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక పోలింగ్ కేంద్రానికి కనీసం 650 మంది ఓటర్లను కేటాయించాలని నిబంధన విధించారు. ఓటర్ల సంఖ్య పరిమితి దాటితే అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల కోసం వీలైనంత వరకు ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లను మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి సాధారణంగా 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా చూడాలని.. కొండ, అటవీ ప్రాంతాలకు ఇందులో మినహాయింపు ఉంటుందని తెలిపారు. పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, మతపరమైన ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు, ప్రైవేట్ భవనాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఉండదు.
పక్కాగా నమోదు
పంచాయతీ ఎన్నికల ప్రకియలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి భవనం పేరు, గదుల వివరాలు, ఓటర్ల సంఖ్య, భవనం చాయచిత్రాలు, ఇతర వివరాలను ఎస్‌ఈసీ–ఈఎంఎస్ పోర్టల్‌లో పక్కాగా నమోదు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించం, వీటిపై కార్యదర్శులకు తగిన ఆదేశాలు జారీచేశాం.
– సుధాకర్‌రావు, డీపీఓ


