కనీస వసతుల్లేవు..
మధ్యాహ్న భోజనమూ లేదు
జ్ఞానజ్యోతి శిక్షణ పేరుతో
అంగన్‌వాడీ కార్యకర్తలతో
వెట్టిచాకిరీ
చిత్తూరు కలెక్టరేట్ : అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల వికాసానికి, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బోధనా నైపుణ్యాలు పెంచేందుకు ‘జ్ఞానజ్యోతి’ పేరుతో కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ ప్రచా ర ఆర్భాటానికే పరిమితమైంది. క్షేత్ర స్థాయిలో ఈ శిక్షణ శిబిరాలు అంగన్‌వాడీ కార్యకర్తలకు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. గొప్పలు చెప్పుకోవడానికే తప్ప, శిక్షణకు వచ్చే సిబ్బందికి కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం, జిల్లా ఐసీడీఎస్ శాఖాధికారులు తీవ్రంగా విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భోజనం మీరే తెచ్చుకోండి!
జిల్లాలోని చిత్తూరు, జీడీనెల్లూరు, నగరి, పలమనేరు, కుప్పం ప్రాజెక్టుల పరిధిలో వందలాది మంది అంగన్‌న్‌వాడీ కార్యకర్తలకు మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. నిబంధనల ప్రకారం శిక్షణకు హాజరైన వారికి మధ్యాహ్న భోజనం, తాగునీరు, స్నాక్స్, టీ సౌకర్యం కల్పించాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం ‘నిధులు రాలేదు.. ఎవరి భోజనం వారే తెచ్చుకోండి అని ముందే చెప్పేయడం వారి అలసత్వానికి అద్దం పడుతోంది. శిక్షణ ప్రాంగణాల్లో కనీసం కూర్చోవడానికి సరిపడా బెంచీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో సగం మందికి పైగా కార్యకర్తలు నేలపైనే కూర్చుని గంటల తరబడి శిక్షణ వినాల్సిన దుస్థితి ఏర్పడింది. తాగడానికి గానీ, అత్యవసరానికి మరుగుదొడ్ల వసతి గానీ లేక మహిళా కార్యకర్తలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.
తప్పని తిప్పలు
కేవలం కార్యకర్తలకే కాకుండా, క్లాసులు చెప్పడానికి వచ్చిన ప్రాజెక్ట్ శిక్షకులు, పర్యవేక్షకులకు (సూపర్‌వైజర్)లకు సైతం భోజన వసతి కల్పించకపోవడం గమనార్హం. ప్రభుత్వం జ్ఞానజ్యోతి అని పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ, శిక్షణ ప్రాంగణాల్లో కనీస బడ్జెట్ కేటాయింపులపై చూపకపోవడంపై అంగన్‌న్‌వాడీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లా వివరాలు
మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు 2,318
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 102
7 నెలల నుంచి మూడేళ్ల పిల్లలు
50,809
మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు
29,539
జిల్లాలోని మొత్తం ప్రాజెక్టులు 12
క్షేత్ర స్థాయిలో
అంగన్‌్‌వాడీలకు అవస్థలే!


