అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా! | US Visa Regulations Set for Major Change Impacting International Students | Sakshi
Sakshi News home page

అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!

Jun 21 2026 5:59 PM | Updated on Jun 21 2026 6:23 PM

US Visa Regulations Set for Major Change Impacting International Students

అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో ఒక పెద్ద మార్పును తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మార్పు అమల్లోకి వస్తే.. యూఎస్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థుల జీవితంపై, ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం అమెరికాలో F-1 వీసాతో చదువుతున్న విద్యార్థులు 'డ్యురేషన్ ఆఫ్ స్టేటస్' అనే విధానంలో ఉంటారు. ఈ విధానం ప్రకారం.. విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండవచ్చు. అంటే చదువు కొనసాగుతున్నంత కాలం వారు వీసా పొడిగింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కోర్సు మార్చుకోవడం, యూనివర్సిటీ మారడం లేదా ఉన్నత చదువులకు వెళ్లడం కూడా సులభంగా జరుగుతుంది.

కానీ.. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఈ సౌలభ్యం తగ్గే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం విద్యార్థులకు ముందుగా నిర్ణయించిన గడువుతో మాత్రమే ప్రవేశ అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. సాధారణంగా ఇది నాలుగు సంవత్సరాల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఆ గడువు పూర్తయిన తర్వాత అమెరికాలో కొనసాగాలంటే విద్యార్థులు తప్పనిసరిగా USCIS ద్వారా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

అమెరికా ప్రభుత్వం ఈ మార్పును తీసుకురావడానికి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కారణం అని చెబుతోంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న విధానంలో కొంతమంది విద్యార్థులు వీసా గడువు దాటినా దేశంలోనే కొనసాగుతున్నారని, వారిని ట్రాక్ చేయడం కష్టమవుతోందని అధికారులు భావిస్తున్నారు. అందుకే మరింత కఠినమైన, స్పష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని ప్రభుత్వం అంటోంది.

అయితే ఈ నిర్ణయంపై.. విద్యా రంగం, ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానం వల్ల విద్యార్థులు తరచూ పొడిగింపుల కోసం దరఖాస్తు చేయాల్సి వస్తుంది. దీనివల్ల పేపర్‌వర్క్ పెరగడం, ఆలస్యం జరగడం, చదువులో అంతరాయం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ఈ మార్పు ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం నుంచి అమెరికాకు ఎక్కువమంది చదువుకోవడానికి వెళ్తున్నారు. కొందరు భారతీయ విద్యార్థులు పీహెచ్‌డీ, రీసెర్చ్ కోర్సులు ఇక్కడే చేస్తారు. దీనికోసం ఐదు నుంచి ఏడేళ్లు అక్కడే ఉండాల్సి వస్తుంది. వీరంతా కొత్త నిబంధనల ప్రకారం.. మధ్యలో తప్పనిసరిగా పొడిగింపులు తీసుకోవాల్సి వస్తుంది.

అదనంగా.. చదువు పూర్తైన తర్వాత ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది. ఇది అమల్లోకి వస్తే.. అమెరికాలో చదువు పూర్తయిన వారు ఉద్యోగాలు వెతకడానికి సమయం సరిపోదు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇదీ చదవండి: భారత్ - ఈయూ ఒప్పందం: పీయూష్ గోయల్ కీలక ప్రకటన!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement