పీవోకేలో పాక్ సైన్యం కాల్పులపై ఐరాస
నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని డిమాండ్
ఐక్యరాజ్యసమితి: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో శాంతిభద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై బలప్రయోగం, కాల్పులకు దిగడం వంటి చర్యలకు పాల్పడిన వారిని తప్పనిసరిగా గుర్తించాలని స్పష్టం చేసింది. పీవోకేలో జరుగుతున్న పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన ప్రతినిధి ఫర్హాన్ హక్ వెల్లడించారు.
ఈ విషయంలో ఐరాస మానవ హక్కుల కమిషనర్ వోల్కర్ టర్క్ వెలిబుచ్చిన అభిప్రాయాలను ఆయన పూర్తిగా సమర్థిస్తున్నారన్నారు. జమ్మూ కశ్మీర్‌తోపాటు లద్దాఖ్‌లోని ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనివేనని, ఇందులో కొంతభాగాన్ని పాక్ సైన్యం చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుని, తిష్ట వేసిందంటూ భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో వాదిస్తోంది. పీవోకేలో హింసాత్మక ఘటనలను అంశాన్ని ఆగస్ట్ 4న ఐరాసలోనూ ప్రస్తావించింది. ఇందుకు పాక్ ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపించింది.
కాల్పుల్లో 400 మంది మృతి
పీవోకే అసెంబ్లీలో వలసదారులకు 12 సీట్లను రిజర్వు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలు ఉద్యమ గ్రూపులతో కూడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్) వరుస ఆందోళనలు కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడి, తమకు నచ్చిన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో జాక్ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.
ఈ నిరసనలను అణచివేసేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నించింది. సైన్యం జరిపిన కాల్పుల్లో 40 మంది చనిపోయారు. తాము జూన్ మొదటి వారం నుంచి సాగిస్తున్న ఆందోళనలపై పాక్ బలగాలు సాగించిన దమనకాండ ఫలితంగా కనీసం 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాక్ ఆరోపిస్తోంది. పీవోకే జరుగుతున్న ఘటనలపై జూలై 17వ తేదీన వోల్కర్ టర్క్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు.
జాక్‌పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించడం, పలువురు నేతలను అరెస్ట్ చేయడం, నిరసనకారులపై కాల్పుల ఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలంటూ ఆయన పాక్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై శుక్రవారం ఫర్హాన్ హక్ జెనీవాలో మాట్లాడుతూ.. ‘శాంతియుత నిరసనలను ప్రభుత్వాలు అనుమతించాల్సిందే. ఇందుకు ఏ ఒక్కరికీ, ఏ దేశానికీ మినహాయింపు లేదు. పీవోకేలో హింసాత్మక చర్యల విషయంలో పాకిస్తాన్‌కూ ఇదే వర్తిస్తుంది. కాల్పులు, ఇతర తీవ్ర చర్యలకు కారకులను పాక్ ప్రభుత్వం గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ ఘటనలపై సంపూర్ణ, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలన్నారు.


