
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు.. దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) షాకిచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) బ్రాంచ్.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడపై నిషేధం విధించింది.
దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు సెప్టెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చాయి. తరువాత నోటీసులు అందేవరకు ఈ ఆర్డర్ అమలులోనే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు కొత్త ఆర్ధిక ఉత్పత్తులకు సంబంధించిన సలహాలు ఇవ్వడం, ఇన్వెస్ట్‌మెంట్ డీల్స్, క్రెడిట్ సంబంధిత సలహాలు ఇవ్వడం, కస్టడీ సర్వీస్ వంటి పలు ఆర్థిక సేవలను నిలిపివేయాలి. అంతే కాకుండా కొత్త ఆర్ధిక ప్రచారాల్లో కూడా బ్యాంక్ పాల్గొనకూడదు. అయితే ఇప్పటికే ఉన్న బ్యాంక్ కస్టమర్లు.. తమ సేవలను యధావిధిగా పొందవచ్చు.
దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు పాటించడానికి బ్యాంక్ సిద్దమైంది. అంతే కాకుండా ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవడానికి.. డీఎఫ్ఎస్ఏతో కలిసి పనిచేయడానికి తాము కట్టుబడి ఉన్నామని హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..
సెప్టెంబర్ 23 నాటికి, దాని డీఐఎఫ్సీ బ్రాంచ్‌లో జాయింట్ హోల్డర్లతో సహా 1,489 మంది కస్టమర్లు ఉన్నారని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. అయితే దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్.. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు లేదా ఆర్థిక స్థితిపై అటువంటి ప్రభావం చూపదని హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. అంతే కాకుండా బ్రాంచ్ కస్టమర్ల నిరంతర సేవలకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది.