
దేశంలోనే తొలి హెల్త్‌కేర్ జీసీసీ ప్రారంభం
రూ.650 కోట్ల పెట్టుబడులు
3000 మందికి ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలంలోనే సుమారు 70కిపైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC)ను ఏర్పాటు కావడం జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసే అంశమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (IT Minister Sridhar Babu) స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి హెల్త్‌కేర్ జీసీసీ ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్’ను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ భారత జీసీసీ రాజధానిగా ఎదుగుతోందని అన్నారు. హాస్పిటాలిటీ రంగంలో మొట్టమొదటి జీసీసీని ఇటీవలే ప్రారంభించామని, తాజాగా హెల్త్‌కేర్‌లోనూ మొట్ట మొదటి జీసీసీ ఇక్కడే ఏర్పాటు కావడం ఎంతైనా హర్షణీయమైన అంశమన్నారు.
జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ ఎదుగుదల దశాబ్దాల క్రితం బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల ఏర్పాటుతోనే మొదలైందని మంత్రి అన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం సుమారు 800 ఫార్మా కంపెనీ (Pharma Companies)లకు కేంద్రంగా నిలిచిందని వివరించారు. ఏపీఐలతోపాటు మందులు, బయలాజిక్స్, స్పెషాలిటీ మెడిసిన్స్, టీకాల తయారీ కేంద్రంగా ఎదిగిందని, ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు అందులో ఒకటి మాత్రమేనని తెలిపారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణలో అపారమైన అనుభవం కలిగిన హెచ్‌సీఏ హెల్త్ కేర్ హైదరాబాద్‌లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ప్రభుత్వ సానుకూల విధానాలకు లభించిన మద్దతుగా భావిస్తున్నట్లు తెలిపారు.
వైద్యం చౌకగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఉండాలన్నది ప్రభుత్వ ప్రయత్నమని, ఈ దిశగా హెచ్‌సీఏ హెల్త్‌కేర్ నుంచి ఏ రకమైన సహాయ సహకారాలనైనా తీసుకునేందుకు సిద్ధమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నైపుణ్యంగల మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఉన్న హైదరాబాద్ భవిష్యత్తులో అంతర్జాతీయ ఆరోగ్య సేవలకు ఒక చుక్కానిలా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని సత్వా నాలెడ్జ్ పార్క్‌లో ఏర్పాటైన ఈ జీసీసీ అమెరికా, యూకేల్లోని 192 ఆసుపత్రులు, 2500కు పైచిలుకు ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించనుంది. నాలుగు అంతస్తుల్లో సుమారు 4.28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ జీసీసీపై సుమారు రూ.650 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్ తెలిపారు. ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులు ఇక్కడి నుంచి ఐటీ, ఫైనాన్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఏడాదిలోపు ఉద్యోగుల సంఖ్యను మూడు వేలకు చేరుస్తామని తెలిపారు.
హెచ్‌సీఏ హెల్త్‌కేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అతుల్ కపూర్ మాట్లాడుతూ ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు, నాణ్యమైన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ జీసీసీ ఉపయోగపడుతుందన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, లైఫ్‌సైన్సెస్ బోర్డు ఛైర్మన్ శక్తి నాగప్పన్, హెచ్‌సీఏ హెల్త్ కేర్ ఉన్నతాధికారులు పలువురు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భారత్‌కు యూఏఈ వీసా నిలిపేసిందా?