సమీప భవిష్యత్తులో భారతదేశంలో తీవ్ర ఉద్యోగ సంక్షోభం ఎదురవుతుందని మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ఈ సంక్షోభానికి ఆర్థిక మాంద్యం కాకుండా, ఏఐ, ఆటోమేషన్ కారణం అవుతుందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో విధాన నిర్ణేతలు వేగంగా చర్యలు తీసుకోకపోతే దీని పరిణామాలు వినాశకరంగా ఉంటాయని స్పష్టం చేశారు.
ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ముఖర్జియా భారతదేశంలోని వైట్ కాలర్ ఉద్యోగ మార్కెట్‌లో భారీగా నియామకాలు తగ్గినట్లు చెప్పారు. ఐటీ, బ్యాంకింగ్, మీడియా వంటి రంగాల్లో ఉన్న ప్రామాణిక కోర్ ఉద్యోగాలు గిగ్ జాబ్స్ ఎకోసిస్టమ్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు.
ఈ ఉద్యోగ సంక్షోభం పూర్తి ప్రభావం రెండు నుంచి మూడు సంవత్సరాల్లో స్పష్టమవుతుందని తెలిపారు. ఆ సమయంలో భారీగా జీతం పొందే ఉద్యోగాలు కనుమరుగవుతాయని ముఖర్జియా అంచనా వేశారు. ఇండియా భారీ గిగ్ ఎకానమీగా మారుతుందని చెప్పారు. ‘ఈ మార్పులు ఆర్థిక మందగమనం వల్ల జరిగేవి కావు. కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి, ఉన్న కొద్ది మంది ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐని వాడనున్నారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఏఐతో భర్తీ చేస్తాయి. ఇందులో బ్యాంకులు, మీడియా హౌస్‌లు, ఐటీ సంస్థలు ఉండొచ్చు. ప్రకటనల రంగంలో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. ప్రకటనలోని మోడల్ కూడా ఏఐనే ఉంటుంది’ అన్నారు.
గృహ రుణ భారం, ట్రంప్ నిర్ణయాలు
‘ఉద్యోగ మార్కెట్‌పై ఒత్తిడికి తోడు పెరుగుతున్న గృహ రుణ భారం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. భారతీయ గృహ రుణాల భారం మొత్తం ఆదాయంలో 33-34%గా ఉంది’ అన్నారు. అంతేకాకుండా, యూఎస్‌తో వాణిజ్య ఉద్రిక్తతలపై కూడా ముఖర్జియా హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై విధించిన సుంకాలను వెనక్కి తీసుకోకపోతే క్రిస్మస్ నాటికి 20 మిలియన్ల(2 కోట్లు) మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రూ.2-5 లక్షలు సంపాదించే వ్యక్తులు తమ ఉద్యోగాలను కోల్పోవడం, దశాబ్దాలుగా ఎగుమతి ఫ్రాంచైజీలను నిర్మించిన కంపెనీలు నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పారు. భారత ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ త్వరలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి రావాలని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ప్రపంచంలో 10 పవర్‌ఫుల్ మిలిటరీ దేశాలు


