రూ.9.3 కోట్లు ప్యాకేజీని వదులుకుని.. ఏఐ వైపు అడుగులు | From Rs 9 3 Cr Google Package to AI Startup Gamble | Sakshi
Sakshi News home page

రూ.9.3 కోట్లు ప్యాకేజీని వదులుకుని.. ఏఐ వైపు అడుగులు

Jun 30 2026 12:26 PM | Updated on Jun 30 2026 12:26 PM

From Rs 9 3 Cr Google Package to AI Startup Gamble

సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం.. కేవలం సరికొత్త ఆవిష్కరణలకే కాదు, ఐటీ నిపుణుల ఆలోచనా ధోరణిలో వస్తోన్న మార్పులకు కూడా వేదికవుతోంది. నెలకు లక్షల జీతం, చేతినిండా స్టాక్ ఆప్షన్లు, గూగుల్ లాంటి గ్లోబల్ టెక్ కంపెనీలో సురక్షితమైన ఉద్యోగం... సగటు ఉద్యోగి కల ఇది. కానీ, ఏటా దాదాపు రూ.9.3 కోట్ల భారీ ప్యాకేజీని సైతం కాదనుకుని ఏఐ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్‌లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన 41 ఏళ్ల యూసఫ్ ఇమ్రాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీ సామాన్యులకు కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తోందంటూ ఆయన పంచుకున్న అనుభవాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

రూ.9.3 కోట్ల ప్యాకేజీ.. ఎలా సాధ్యమైంది?

సేల్స్ రంగంలో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఇమ్రాన్ 2020లో గూగుల్‌ సంస్థలో చేరారు. క్లయింట్‌లకు గూగుల్ ‘ఏఐ మెషిన్ లెర్నింగ్’ సొల్యూషన్స్‌ను చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన బేసిక్ శాలరీ దాదాపు 1,70,000 డాలర్లు (సుమారు రూ.1.6 కోట్లు) కాగా, కస్టమర్ డీల్స్ ద్వారా వచ్చిన కమీషన్లే ఆయన ఆదాయాన్ని పెంచాయి. డబ్ల్యూ2 ఎర్నింగ్స్(అలవెన్స్‌లు) ద్వారా గతేడాది ఆయన వార్షిక సంపాదన దాదాపు 9,86,000 డాలర్లు (సుమారు రూ. 9.3 కోట్లు)గా ఉంది.

‘నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు మా కుటుంబం బంగ్లాదేశ్ నుంచి న్యూయార్క్‌కు వలస వచ్చింది. ఆ వలసదారుల కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మార్కెట్ అవసరాలు, ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్లే నేను అంతటి కమీషన్లు సాధించగలిగాను’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.

భారీ జీతాన్ని వదులుకోవడానికి కారణం

మార్కెట్లో ఓపెన్ ఏఐ (ChatGPT), ఆంత్రోపిక్ (Claude) వంటి సంస్థలు సృష్టిస్తున్న సంచలనాలు ఇమ్రాన్‌లో ఫోమో (ఎక్కడ తాను వెనుకబడిపోతానో అనే ఆందోళన)ను రేకెత్తించాయి. గూగుల్ సురక్షితమైనదే అయినప్పటికీ భవిష్యత్తు అంతా ఏఐ స్టార్టప్‌లదేనని, వాటిలో ఈక్విటీ (భాగస్వామ్యం) కలిగి ఉండటం లాభదాయకమని ఆయన భావించారు. మరోవైపు, గూగుల్‌లో ఇటీవలి కాలంలో జరిగిన ఉద్యోగుల తొలగింపులు కూడా ఆయన ఆలోచనా విధానాన్ని మార్చాయి. ఎంత ప్రతిభావంతులైనా కార్పొరేట్ కొలువుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో సొంతంగా రిస్క్ తీసుకోవడమే ఉత్తమమని ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు.

రాత్రిపూట ఏఐ సాధన..

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఇమ్రాన్ వెనకడుగు వేయలేదు. పగలు ఉద్యోగం చేస్తూనే.. రాత్రులు, వారాంతాల్లో చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ టూల్స్ సాయంతో కోడింగ్ నేర్చుకుంటూ ప్రాజెక్ట్‌లు డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్‌లో గూగుల్‌కు గుడ్ బై చెప్పి ‘మాంగోస్టీన్ స్టూడియో’ అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇది సేల్స్ నిపుణుల కోసం ప్రత్యేక ఏఐ ఆధారిత టూల్స్‌ను రూపొందిస్తుంది. ఆవేశంతో కాకుండా పూర్తి ఆర్థిక ప్రణాళికతోనే ఇమ్రాన్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు ఇమ్రాన్‌ చెప్పారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement