బంగారం మరింత కొనే సమయం వచ్చిందా? | Robert Kiyosaki Gold continues drop price when to buy more | Sakshi
Sakshi News home page

బంగారం మరింత కొనే సమయం వచ్చిందా?

Jun 25 2026 2:21 PM | Updated on Jun 25 2026 2:32 PM

Robert Kiyosaki Gold continues drop price when to buy more

ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రపంచ ప్రఖ్యాత ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) బంగారం ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటం మంచి వార్తేనని ఆయన తన ఎక్స్‌ (X) ఖాతాలో పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతం మరింత బంగారం కొనుగోలు చేసే సమయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ధరలు తగ్గుతున్నాయనే కారణంతోనే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక ఇంటి ధర తగ్గితే కేవలం తక్కువ ధర చూసి కొనుగోలు చేయరని, ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా పరిశీలిస్తామని ఉదాహరణగా వివరించారు. అదే విధంగా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతోంది? అనే అంశాలను తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.

ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతున్నాయని భావిస్తే తాను బంగారం కొనుగోలుకు దూరంగా ఉండవచ్చని, కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల దిశగా సాగుతోందని సంకేతాలు కనిపిస్తే తక్కువ ధరల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న బంగారంలో చాలా భాగాన్ని 2000 ప్రాంతంలో ఔన్స్‌కు సుమారు 300 డాలర్ల ధర వద్ద కొనుగోలు చేశానని కియోసాకి గుర్తుచేశారు.

మార్కెట్ ధోరణి (ట్రెండ్)ను గమనించడం పెట్టుబడిదారులకు అత్యంత కీలకమని, ధరల కంటే వాటి వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడమే విజయవంతమైన పెట్టుబడులకు మూలమని ఆయన తన పోస్ట్‌లో సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement