లోన్ తీసుకున్నవారికి RBI గుడ్‌న్యూస్‌! | RBI Proposes New Loan Rules, What Borrowers Need to Know About EMIs | Sakshi
Sakshi News home page

లోన్ తీసుకున్నవారికి RBI గుడ్‌న్యూస్‌!

Aug 18 2026 12:06 PM | Updated on Aug 18 2026 12:33 PM

RBI Proposes New Loan Rules, What Borrowers Need to Know About EMIs

లోన్లు తీసుకున్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. ముఖ్యంగా.. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్న వారికి మరింత రక్షణ కల్పించేలా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చింది. ఇక వడ్డీ రేట్లను నిర్ణయించే బెంచ్‌మార్క్‌లో ఏవైనా మార్పులు చేసే సమయంలో వినియోగదారుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

రుణగ్రహీతలకు రక్షణ
కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో ప్రధానంగా.. లోన్ వడ్డీ రేట్లలో పారదర్శకత తీసుకురావడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టింది. స్థిర, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు, బెంచ్‌మార్క్ ఎంపిక, వడ్డీ రేట్ల మార్పులు, స్ప్రెడ్‌లు, ఇప్పటికే ఉన్న రుణాలు వంటి అంశాలకు ఇందులో నిబంధనలు ప్రతిపాదించారు. ముఖ్యంగా బెంచ్‌మార్క్ మార్పు కారణంగా రుణగ్రహీతపై ఒక్కసారిగా అదనపు వడ్డీ భారం పడకుండా చూడాలని ఆర్బీఐ సూచించింది.

బెంచ్‌మార్క్ మార్చితే ఏం జరుగుతుంది?
ఫ్లోటింగ్ రేట్ లోన్లలో వడ్డీ రేటు సాధారణంగా ఒక బెంచ్‌మార్క్‌కు అనుసంధానమై ఉంటుంది. ఆ బెంచ్‌మార్క్ మారితే లోన్ మీద చెల్లించే వడ్డీ కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే.. కొత్త విధానంలో బెంచ్‌మార్క్, దాని రీసెట్ వ్యవధి, రీసెట్ తేదీ వంటి వివరాలను లోన్ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇప్పటికే ఉన్న రుణాలను కొత్త ఫ్రేమ్‌వర్క్‌లోకి మార్చేటప్పుడు కూడా రుణగ్రహీత ప్రయోజనాలకు నష్టం కలగకుండా చూడాలి. అలాగే మార్పు కోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని ప్రతిపాదించింది.

బెంచ్‌మార్క్ అందుబాటులో లేకపోతే?
ఒకవేళ ఫ్లోటింగ్ రేట్ లోన్‌కు అనుసంధానమైన బెంచ్‌మార్క్ భవిష్యత్తులో నిలిచిపోతే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆర్బీఐ ప్రతిపాదనలో వివరించింది. అలాంటి సమయంలో రుణదాత మరో బెంచ్‌మార్క్‌కు మారాల్సి ఉంటుంది. అయితే.. ఆ మార్పు వల్ల రుణగ్రహీతకు అన్యాయం జరగకూడదు. ఇందుకోసం లోన్ ఒప్పందంలో ముందుగానే ఫాల్‌బ్యాక్ బెంచ్‌మార్క్ను పేర్కొనే అవకాశం ఉంటుంది. అంటే.. అసలు బెంచ్‌మార్క్ అందుబాటులో లేకపోతే ఏ ప్రత్యామ్నాయ బెంచ్‌మార్క్ వర్తిస్తుందో ముందే స్పష్టంగా ఉండేలా చూడనున్నారు.

పాత లోన్లకు కూడా కొత్త విధానం
ఇప్పటికే అంతర్గత లేదా బాహ్య బెంచ్‌మార్క్‌లకు అనుసంధానమైన అన్ని రుణాలను కొత్త ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం.. ఒకసారి మాత్రమే మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించి, ఈ మార్పును 2029 ఏప్రిల్ 1 నాటికి పూర్తి చేయాలని సూచించింది. అయితే.. ఈ మార్పు రుణగ్రహీతపై అదనపు ఆర్థిక భారాన్ని మోపకూడదు. ముఖ్యంగా మార్పు తర్వాత వర్తించే వడ్డీ రేటు, మార్పుకు ముందు ఉన్న రేటు కంటే ఎక్కువగా ఉండకూడదనే రక్షణను ప్రతిపాదించారు.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఆర్బీఐ ప్రతిపాదించిన కొత్త ఫ్రేమ్‌వర్క్ వల్ల బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లు, బెంచ్‌మార్క్‌లు, స్ప్రెడ్‌ల విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ లోన్లు తీసుకున్న వారికి బెంచ్‌మార్క్ మార్పుల వల్ల అనూహ్యంగా రుణ భారం పెరగకుండా కొన్ని రక్షణలు లభించే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రస్తుతం ఆర్బీఐ ప్రతిపాదించిన డ్రాఫ్ట్ నిబంధనలు మాత్రమే. తుది నిబంధనలు వెలువడిన తర్వాతే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement