క్రెడ్‌తో మెటా మెగా డీల్‌ | Meta to invest 900 million dollars in India CRED | Sakshi
Sakshi News home page

క్రెడ్‌తో మెటా మెగా డీల్‌

Jun 23 2026 12:16 AM | Updated on Jun 23 2026 12:16 AM

Meta to invest 900 million dollars in India CRED

రూ. 8,550 కోట్ల పెట్టుబడులు 

సీఈవోగా తప్పుకోనున్న కునాల్‌ షా 

ఇకపై వాట్సాప్‌కి సారథ్యం 

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం మెటా నుంచి రూ. 8,550 కోట్లు సమీకరిస్తున్నట్లు దేశీ ఫిన్‌టెక్‌ సంస్థ క్రెడ్‌ వెల్లడించింది. రూ. 38,819 కోట్ల వేల్యుయేషన్‌తో (4.03 బిలియన్‌ డాలర్ల) చేపట్టిన నిధుల సమీకరణ అనంతరం కంపెనీ వేల్యుయేషన్‌ సుమారు రూ. 43,239 కోట్లకి (4.5 బిలియన్‌ డాలర్లు) చేరుతుంది. క్రెడ్‌లో మెటా మైనారిటీ వాటాదారుగా ఉంటుంది. తాజాగా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది. 

ఈ మెగా డీల్‌ ప్రకారం క్రెడ్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ షా.. కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హోదా నుంచి తప్పుకుంటారు. మెటాలో భాగమైన మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌కి అంతర్జాతీయంగా సారథ్యం వహిస్తారు. గ్లోబల్‌గా మెటా లీడర్‌షిప్‌ టీమ్‌లో ఆయన భాగమైనప్పటికీ.. క్రెడ్‌లో వ్యక్తిగతంగా తన వాటాలను అట్టే పెట్టుకోనున్నారు. 

క్రెడ్‌లో 2020 నుంచి స్ట్రాటెజీ, ఫైనాన్స్‌ హెడ్‌గా వ్యవహరిస్తున్న మితేన్‌ సంపత్‌ తక్షణం తాత్కాలిక సీఈవోగా నియమితులయ్యారు. 2018లో ప్రారంభమైన క్రెడ్‌ని ప్రస్తుతం నెలవారీగా 1.7 కోట్ల మంది సభ్యులు ఉపయోగిస్తున్నారు. దేశీయంగా క్రెడిట్‌ కార్డ్‌ బిల్లుల చెల్లింపుల్లో 40 శాతానికి పైగా లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తోంది. రుణాల వ్యాపార విభాగం ఏయూఎం 
రూ. 24,000 కోట్లకి చేరుకుంది.

గ్లోబల్‌ భారతీయ సీఈవోల లిస్టులో చోటు.. 
వాట్సాప్‌ సీఈవోగా వ్యవహరించనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలో కునాల్‌ షా కూడా చేరినట్లవుతుంది. ఇప్పటికే టెక్‌ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్‌కి నేతృత్వం వహిస్తున్న సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ తదితరుల సరసన ఆయన కూడా చేరతారు. ఈ ఏడాది తొలినాళ్లలో మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ సీఈవోగా ఆశా శర్మ నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్‌లో ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసరుగా రాహుల్‌ పాటిల్‌ చేరారు. అలాగే 2023లో యూట్యూబ్‌ సీఈవోగా నీల్‌ మోహన్, కాగ్నిజెంట్‌ సీఈవో ఎస్‌ రవి కుమార్‌ చేరారు.  

టీమ్‌ క్రెడ్‌.. మీరంతా కూడా పది రెట్లు వృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. నా విషయానికొస్తే.. అంతర్జాతీయంగా వాట్సాప్‌కి నేతృత్వం వహించేందుకు నేను మెటాలో చేరుతున్నాను. 
– కునాల్‌ షా, క్రెడ్‌ ఫౌండర్, సీఈఓ

భారత్‌లో అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా క్రెడ్‌ని షా తీర్చిదిద్దారు. కోట్లాది ప్రజలు, వ్యాపారాలకు అత్యుత్తమ సేవలందించేలా వాట్సాప్‌ని తీర్చిదిద్దేందుకు షాతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నాను.  
– మార్క్‌ జుకర్‌బర్గ్, మెటా సీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement