జాబ్ కోసం పోతే.. షాకింగ్ అనుభవం! | Job Interview Turns Shocking for Pune Candidate | Sakshi
Sakshi News home page

జాబ్ కోసం పోతే.. షాకింగ్ అనుభవం!

Jun 20 2026 9:08 PM | Updated on Jun 21 2026 11:03 AM

Job Interview Turns Shocking for Pune Candidate

జాబ్ మార్కెట్ కరోనా మహమ్మారి తర్వాత ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు వరుస తిరస్కరణలు, ఇంటర్వ్యూల తర్వాత స్పందన లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పూణేకు చెందిన ప్రణవ్ అనే యువకుడు ఎదుర్కొన్న అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఉద్యోగం కోసం నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరైన ప్రణవ్‌కు అక్కడ అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. సాధారణంగా ఇంటర్వ్యూల్లో అభ్యర్థి నైపుణ్యాలు, ప్రాజెక్టులు, అనుభవం గురించి ప్రశ్నలు అడుగుతారు. కానీ ఈ సంస్థలో హెచ్‌ఆర్ ప్రతినిధి మొదట అడిగిన ప్రశ్న మాత్రం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. ''మీరు వచ్చే 6 నుంచి 8 నెలల వరకు జీతం లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ తర్వాత మీ పనితీరు బాగుంటే జీతం ఇవ్వాలా వద్దా నిర్ణయిస్తాం'' అని అడిగినట్లు ప్రణవ్ వెల్లడించాడు.

ఈ మాటలు విన్నప్పుడు వారు సరదాగా మాట్లాడుతున్నారని మొదట భావించినట్లు ప్రణవ్‌ చెప్పాడు. ఎన్నో సంవత్సరాలు చదివి, సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకుని, ప్రాజెక్టులు చేసి, ఇంటర్వ్యూలకు సిద్ధమై వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఉద్యోగాన్ని జీతం లేకుండా చేయమని చెప్పడం తనకు షాక్‌గా అనిపించిందని పేర్కొన్నాడు.

ప్రణవ్ అభిప్రాయం ప్రకారం.. ఇది సాధారణ ఇంటర్న్‌షిప్ లేదా ట్రైనింగ్ లాంటిది కాదు. ఇంటర్న్‌షిప్‌లలో కొన్నిసార్లు స్టైపెండ్ లేకపోవచ్చు లేదా తక్కువ మొత్తంలో చెల్లించవచ్చు. కానీ ఇక్కడ కంపెనీ పూర్తి స్థాయి ఉద్యోగం కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తూ జీతం లేకుండా పనిచేయాలని అడగడం అన్యాయమని అతను భావించాడు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ సంస్థలో సీఈఓ, హెచ్‌ఆర్ ప్రతినిధి మాత్రమే పనిచేస్తున్నట్లు తనకు కనిపించిందని, అయినప్పటికీ భారీ స్థాయిలో వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారని తెలిపాడు. ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న యువత పరిస్థితిని కొన్ని సంస్థలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. పుణేలో ఇలాంటి అనేక స్టార్టప్‌లు ఉచిత శ్రమను పొందేందుకు ఉద్యోగాల పేరుతో అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు, ఒక సంస్థ ఉద్యోగికి జీతం చెల్లించలేకపోతే అతడిని ఉద్యోగిగా కాకుండా భాగస్వామిగా పరిగణించి కంపెనీలో వాటా ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement