
అదృష్టం ఎప్పుడు ఎవరినీ ఎలా వరిస్తుందో చెప్పలేం. 30 ఏళ్లుగా తల్లిదండ్రులకు దక్కని అదృష్టం వారి కొడుక్కి దక్కింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థి వేన్ నాష్ డిసౌజా 1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8.7 కోట్లు గెలుచుకున్నాడు.
ఇల్లినాయిస్ అర్బానా-చాంపైన్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యను ప్రారంభించడానికి యూఎస్ వెళ్తున్న వేన్.. వెళ్తూ వెళ్తూ జూలై 26న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాటరీ టికెట్ కొన్నాడు. లక్కీ డ్రాలో ఆ టికెట్‌కే (సిరీస్ 510, నంబర్ 4463) జాక్‌పాట్ తగిలింది.
వేన్ నాష్ డిసౌజా దుబాయ్‌లోనే పుట్టి పెరినప్పటికీ అతని తల్లిదండ్రులు ముంబైకి చెందినవారు. వేన్‌కు టీనేజర్ కావడంతో సొంతంగా అకౌంట్ లేదు. 18 ఏళ్లు నిండినా ఇప్పుడిప్పుడే కావడంతో అకౌంట్ సెట్ చేసుకోలేదు. దీంతో తన తండ్రి అకౌంట్‌ను ఉపయోగించి వేన్ డ్రాలోకి ప్రవేశించాడు. అతని కుటుంబం 30 సంవత్సరాలకు పైగా రాఫెల్ డ్రాలో పాల్గొంటోంది. అయినా వారికి దక్కని జాక్‌పాట్ వేన్‌కు దక్కింది.
వేన్ ఒక రోజు యూనివర్సల్ స్టూడియోలో నిద్రిస్తుండగా కాల్ వచ్చింది. తాను లాటరీ గెలిచినట్లు వారు తెలియజేశారు. దీంతో అతనికి ఇంక నిద్ర పట్టలేదు. ఈ విషయాన్ని వేన్ మొదట నమ్మలేదు. అంతా కల అనుకున్నాడు. ఈ ప్రైజ్ మనీని తన విద్యకు, తన సోదరి చదువుల కోసం, దుబాయ్ లో ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించాలనుకుంటున్నట్లు వేన్ తెలిపాడు. 1999లో ఈ డ్రా ప్రారంభమైనప్పటి నుంచి 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ అందుకున్న 255వ భారతీయుడిగా వేన్ నిలిచాడు.