వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ వ్యవహారం.. కేంద్రం నోటీసులు | Indian Govt Notice To Meta On WhatsApp Usernames Feature That Allows Users To Chat Without Revealing Phone Numbers | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ వ్యవహారం.. కేంద్రం నోటీసులు

Jul 1 2026 9:00 PM | Updated on Jul 2 2026 3:39 PM

Indian Govt notice to Meta on WhatsApp Usernames feature

మొబైల్‌ నంబర్‌ను వెల్లడించకుండా వాట్సాప్‌లో సంభాషణలు ప్రారంభించేలా రూపొందించిన ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కొత్త వ్యవస్థ సైబర్‌ నేరాలు, ఫిషింగ్‌, ఇంపర్సనేషన్‌, ‘డిజిటల్‌ అరెస్ట్‌’ తరహా మోసాలకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో వాట్సాప్‌ యాజమాన్య సంస్థ మెటాకు  కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్‌పై నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) భారత కార్యకలాపాలకు సంబంధించిన వాట్సాప్‌ చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారికి పంపిన లేఖలో, యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు తమ మొబైల్‌ నంబర్‌కు బదులుగా ప్రత్యేక యూజర్‌నేమ్‌ను ఉపయోగించి కొత్త వ్యక్తులతో చాట్‌ ప్రారంభించవచ్చు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి సంప్రదించే వారికి ఫోన్‌ నంబర్‌ కనిపించకుండా ఉండేలా ఈ వ్యవస్థ రూపొందించారు. అదనపు భద్రత కోసం ఐచ్ఛికంగా ‘యూజర్‌నేమ్‌ కీ’ని కూడా సెట్‌ చేసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్‌ వెల్లడించింది.

అయితే, ఈ ఫీచర్‌ను సైబర్‌ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు లేదా ప్రముఖుల పేర్లను పోలిన యూజర్‌నేమ్‌లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసగించే ప్రమాదం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాల దృష్ట్యా ఈ ఫీచర్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.

తాజా పరిణామాల ప్రకారం, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భారత్‌లో యూజర్‌నేమ్‌ ఫీచర్‌ను అమలు చేయవద్దని కూడా మెటాకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. మెటా నుంచి వచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement