ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం స్టాక్ మార్కెట్లను శాసిస్తున్న వేళ ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. గ్లోబల్ ఏఐ రేసులో ఆధిపత్యం చెలాయించే స్పష్టమైన ఏఐ విజేతలు లేకపోవడంతో భారత్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు తమ అగ్రశ్రేణి కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాను కోల్పోయాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ దేశాల ప్రధాన సూచీల్లో టాప్-10 కంపెనీల మూలధన వ్యయం తగ్గడం గమనార్హం.
క్షీణించిన ఆధిపత్యం
ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్‌ను పరిశీలిస్తే భారత్, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో టాప్ కంపెనీల వాటా తగ్గింది. మిగిలిన ప్రధాన మార్కెట్లలో ఏఐ ఆధారిత టెక్ దిగ్గజాలు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.
టాప్-10 దేశాల మార్కెట్ క్యాప్ వాటా (ఏడాది క్రితం.. ప్రస్తుతం)
| దేశం / మార్కెట్ | ఏదాది క్రితం వాటా | ప్రస్తుత వాటా | మార్కెట్ సరళి |
|---|---|---|---|
| చైనా | 26% | 19% | క్షీణత |
| భారతదేశం | 22% | 19% | క్షీణత |
| హాంకాంగ్ | 10% | 9.8% | స్వల్ప మార్పు |
| తైవాన్ | 49% | 56% | భారీ వృద్ధి |
| దక్షిణ కొరియా | ~ 32% | 65% | రెట్టింపు వృద్ధి |
‘ఆసియా టెక్నాలజీ మార్కెట్‌లో ఏఐ, మెమరీ చిప్ విజేతలు ఇండెక్స్‌లను లీడ్ చేస్తుంటే.. భారత్, చైనా, హాంకాంగ్‌లలో ఏ ఒక్క ఆధిపత్య ఏఐ విన్నింగ్ కంపెనీ లేకపోవడంతో టాప్ సంస్థల వాటా పడిపోతోంది’ అని సాక్సో మార్కెట్స్ (సింగపూర్) చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ చారు చనానా అన్నారు.
తైవాన్, దక్షిణ కొరియా దేశాల దూకుడు
ఏఐ సరఫరా గొలుసులో కీలక పాత్ర పోషిస్తున్న కంపెనీలు ఉన్న మార్కెట్లు ఊహించని రీతిలో లాభపడ్డాయి. చిప్ తయారీ దిగ్గజం ‘తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో’ (టీఎస్‌ఎంసీ) అద్భుతమైన లాభాల బాటలో పయనించడంతో తైవాన్ బెంచ్‌మార్క్ సూచీ ఈ ఏడాది ఏకంగా 54% పెరిగింది. అక్కడ టాప్-10 కంపెనీల వాటా 56%కి చేరింది.
దక్షిణ కొరియాలో హై-బ్యాండ్ విడ్త్ మెమరీ లీడర్స్ అయిన ఎస్‌కే హైనిక్స్ ఇంక్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ లీడ్‌తో కొరియా కోస్పి ఇండెక్స్ దాదాపు రెట్టింపు అయింది.
భారత మార్కెట్ స్థితిగతులు
భారతదేశ విషయానికి వస్తే నిఫ్టీ 50 బెంచ్‌మార్క్ ఈ ఏడాది 8% మేర క్షీణించింది. దీనికి ప్రధాన కారణం ఇండెక్స్‌లో సాంప్రదాయ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల ఆధిపత్యం ఎక్కువగా ఉండటమే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలు ఇంకా సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవల్లోనే ఎక్కువగా పాతుకుపోయి ఉన్నాయి. ఇవి ఏఐ వల్ల భవిష్యత్తులో అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూచీలో భారీ వెయిటేజీ ఉన్న కంపెనీలు ఇండెక్స్‌ను ముందుకు లాగలేకపోతుండగా వాటిని భర్తీ చేసే కొత్త తరం ఏఐ ఇంజిన్లు ఇంకా మన మార్కెట్లో పుట్టుకురాలేదని చెబుతున్నారు.
ఇదీ చదవండి: గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా?


