గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా? | From Garden City To Garbage City Bengaluru Urban Decay Sparks Outrage, Kiran Mazumdar-Shaw Calls For Greener | Sakshi
Sakshi News home page

గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా?

Jun 29 2026 8:32 AM | Updated on Jun 29 2026 10:40 AM

From Garden City to Garbage City Bengaluru Urban Decay Sparks Outrage

ఒకప్పుడు దేశ విదేశీయులను ఆకర్షించిన గార్డెన్ సిటీ (ఉద్యాన నగరం) బెంగళూరు.. ఇప్పుడు అస్తవ్యస్త ప్రణాళికలు, కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న వైనంతో తన ఉనికిని కోల్పోతోందా? బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్‌షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ఐటీ కారిడార్‌లో చర్చకు దారితీశాయి. బెంగళూరును ఆమె నేరుగా గార్బేజ్ సిటీ(చెత్త నగరం) అని సంబోధించడం, అక్కడి పట్టణ ప్రణాళిక వైఫల్యాలను ఎండగట్టడం ఐటీ నిపుణులు, సామాన్య ప్రజల్లో చర్చకు తెరలేపింది.

గ్రాఫిక్ చిత్రం ఏం చెబుతోంది?

నగర రోడ్ల దుస్థితిని వివరిస్తూ కిరణ్ ఒక ఆసక్తికరమైన గ్రాఫిక్ చిత్రాన్ని షేర్ చేశారు. ‘మన గార్డెన్ సిటీని ప్రతిబింబించేలా మన రోడ్లను ఈ విధంగా రూపొందించాలి, ప్లాన్ చేయాలి. దురదృష్టవశాత్తు పచ్చదనం తగ్గుతూ చెత్త నగరంగా మారింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రాఫిక్ ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌కు సంబంధించిన రెండు విభిన్న వెర్షన్లను పోల్చి చూపించింది.

మనం నిర్మించింది (What We Built): కాంక్రీట్ విస్తరణతో కూడిన ప్రస్తుత దుస్థితి. రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను పూర్తిగా తొలగించడం, పాదచారుల ఫుట్‌పాత్‌లు, సర్వీస్ రోడ్లను తుడిచిపెట్టడం, ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా చేయడం ఇందులో కనిపించింది.

మనం నిర్మించాల్సింది (What We Could Have Built): పర్యావరణ అనుకూల ప్రణాళిక. అదే కారిడార్‌లో పాత చెట్లను కాపాడుకుంటూనే సైక్లింగ్ ట్రాక్‌లు, విశాలమైన ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, బెంచీలు, చెత్త డబ్బాలు వంటి ఆధునిక పౌర సౌకర్యాలతో తిరిగి రూపకల్పన చేయవచ్చని ఆ చిత్రం చూపించింది.

నెటిజన్ల స్పందన

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, నగర పౌరుల నుంచి తీవ్ర స్పందన తీసుకొచ్చింది. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాలకు పేలవమైన ప్రణాళిక, బలహీనమైన పాలన, అవినీతి, అధికారుల జవాబుదారీతనం లేకపోవడమే కారణమని నెటిజన్లు ఏకిపారేశారు. ‘ఈ నగరాన్ని దోచుకోవడానికి నిర్వాహకులు, రాజకీయ నాయకులు చేతులు కలిపారు. ఐరన్‌, సిమెంట్ మొదలైన వాటిలో ఎక్కువ కమీషన్లు దండుకోవచ్చు కాబట్టే కాంక్రీట్ రోడ్లపై ఆసక్తి కనబరుస్తారు. వారు నాటిన చెట్లలో కమీషన్లు రావు కదా!’ అని ఒక యూజర్‌ స్పందించారు.

మరికొందరు నెటిజన్ల అభిప్రాయాలు ఇలా..

భారతీయ నగరాలు ఏమాత్రం నిలకడగా లేవు. అంతర్జాతీయ నగరాల మాదిరిగా పన్నులు, ఖర్చులు వసూలు చేస్తారు. కానీ కనీస సౌకర్యాలు లేక పేద దేశంగా జీవించాల్సి వస్తోంది. సిగ్గుచేటు.

ఉన్నవాటిని సరిగ్గా నిర్వహించడం, చట్టాలను కఠినంగా అమలు చేస్తే చాలు. ప్రజలు సహనం కోల్పోయారు, ఎవరూ ఏ నియమాన్ని పాటించడం లేదు. గార్డెన్ సిటీ చెత్త నగరంగా మారుతున్న విషయం ప్రభుత్వానికి, అడ్మినిస్ట్రేషన్‌కు తెలియదా?

మొత్తం బడ్జెట్ నుంచి కమీషన్లు ఎలా పొందాలో ప్రభుత్వ ఉద్యోగులు, నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బాధ్యత, జవాబుదారీతనం లేనంత వరకు ఏదీ మెరుగుపడదు. బెంగళూరు అభివృద్ధి కోసం ఎవరైనా నిజాయితీగా ప్లాన్ చేస్తారని ఆశించడం అత్యాశే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement